జైఆంధ్ర ఉద్యమం తీర్చిదిద్దిన నాయకుడు, రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ జనవరి 25 న రాజమండ్రిలో సభను ఏర్పాటు చేశారు. జై ఆంధ్ర ఉద్యమకాలంలో 32 రోజులు జైల్లో వున్న ఈయన " ఆనాడు, ఆంత బలంగా ప్రత్యేక రాష్టా్రన్ని కోరుకున్న ప్రజలు నేడు రాష్ట్ర విభజనను ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు" వివరించడానికి, తెరమరుగైన జ్ఞాపకాలను గుర్తుచేయడానికీ 25 నాటి సభకు రావాలని బహిరంగ లేఖలో ప్రజలకు విజ్ఞప్తిచేశారు.సీమాంధ్రలో పలు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు ఈ సభకు హాజరౌతూండటాన్ని బట్టి ఇది సమైఖ్యతా సభగానే అర్ధమైపోతోంది.వాదించి ఒప్పించడంలో సాటిరాగలవారులేరనిపించే అరుణ్ 4 దశాబ్దాల్లో జరిగిన పరిణామాలనుబట్టి కలసి వుంటేనే మంచిదని అనర్గళంగా ఔననిపించేయగలరు. రాజీవ్ గాంధీ ఉపన్యాసాల తెలుగు అనువాదకుడిగా అధినేతలైన సోనియా, రాహుల్ తో పరిచయమున్న అరుణ్ కుమార్ మాటలకు విశేష ఆకర్షణ పరిగణ వుంటాయి.
ఆంధ్రప్రదేశ్ సమైఖ్యత - కాంగ్రెస్ విధనమైనా, కాకపోయినా అరుణ్ కుమార్ సభ మాత్రం సమైఖ్యతా వాదులకు బూస్టే అవుతుంది. ఎందుకంటే ఉద్యమాలూ పోరాటాలూ తెలంగాణా వాదులకు అలంకారాలైతే...పత్రికా గోష్టుల్లో టివి షోల్లో మాత్రమే సమైఖ్య పోరాటం చేస్తున్నారన్న నిజాన్ని సీమాంధ్ర నేతలు మోస్తున్నారు కాబట్టి!
ముగ్గురూ కాంగ్రెస్ ఎంపిలే వున్న ఈ జిల్లాలో కాకినాడనుంచి కేంద్ర క్యాబినెట్ లోవున్న పల్లం రాజు స్వభావికంగానే సంచలన వ్యాఖ్యానాలకు దూరంగా వుంటారు. రాష్ట్రవిభజన తప్పేలా లేదా అన్న ప్రశ్నకు "అలాంటి సూచనలులేవు" అని బదులిచ్చారు. రాష్ట్రం విడిపోదు అని కూడా చెప్పడం ద్వారా తన సమైఖ్యవాదాన్ని బయటపెట్టుకున్నారు
అధికారపార్టీలో అసమ్మతివాదిగా కనిపించే,పోరాటయోధుడు అనిపించే అమలాపురం ఎంపి హర్షకుమార్ మాత్రం రాష్ట్రం విడిపోతేనే మంచిదన్న తన వేర్పాటు వాదాన్ని ఎప్పుడూ దాచిపెట్టుకోలేదు. మాల మాదిగల వర్గీకరణ వివాదం లేకుండా చేయడానికి కూడా రాష్ట్రవిభజన ఉపయోగపడుతుందని హర్షకుమార్ నమ్ముతున్నరని అర్ధమౌతోంది.హెచ్చుమంది మాదిగలున్న తెలంగాణా, హెచ్చుమంది మాలలున్న ఆంధ్రా - వేర్వేరు రాష్టా్రలైతే వర్గీకరణ సమస్యే మాయమైపోతుందన్నది ఓ లాజిక్. ఇందుకోసం హర్షకుమార్ ఉద్యమించడం లేదు. అయితే, అవసరమైతే "వేర్పాటు" తో సహా ఏ పోరాటానికైనా ఆయన ముందే వుంటారు.అందుకు సిద్ధంగానే వున్నారు