Saturday, February 16, 2013

జూన్ తరువాత ప్రధాని ఎవరు? - 'ముందస్తు' పరిష్కారం!

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈఏడాది జూన్ 14 న ముగుస్తుంది. ఆయన ప్రజలు నేరుగా ఎన్నుకునే లోక్ సభనుంచిగాక అస్సాంనుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మన్మోహన్ అనుకుంటే మళ్ళీ రాజ్యసభనుంచి ఎన్నిక కావడం కేవలం లాంఛనమే! అయితే ఇక పోటీ చేసే ఉద్దేశ్యం తనకులేదని ఆయన స్పష్టం చేసేశారని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

ఇపుడు అధికారంలో వున్న 15 వలోక్ సభ పదవీకాలం 2014 ఫిబ్రవరిలో ముగుస్తుంది. మన్మోహన్ పదవి ఖాళీ అయితే లోక్ సభ కాలం ముగిసేవరకూ మరెవరినైనా ప్రధానిగా నియమించవలసివుంటుంది. అదిఇష్టంలేని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టుంది.

సోనియానుంచి నిర్ణయాధికారాలు రాహుల్ కు అధికారికంగా బదిలీఅయ్యాయి. పార్టీ ఉపాధ్యక్షుడిగా అయన బాధ్యతల స్వీకారంతో ఇది మొదలైంది. పార్టీలో ఆయన సొంత, కొత్త విధానాల అమలు మొదలయినట్టుంది.

కాంగ్రేస్, మిత్రపక్షాలు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారు. మన్మోహన్ సింగ్ కుర్చీ ఖాళీచేశాక రాహుల్ ఆ పదవిలోకి వచ్చేలోగా మరో వ్యక్తి ఆస్ధానంలోకి రావడం వల్ల చరిత్రలో అది నమోదౌతుందేతప్ప అందువల్ల దేశానికీ కాంగ్రెస్ కీ ఏప్రయోజనమూ వుండదు. ఈ పరిస్ధితి లేకుండా చూడాలంటే మన్మోహన్ రాజీనామా చేసినపుడే లోక్ సభను రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలి. ఆకొద్దిపాటివ్యవధిలోప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్ డి ఎ ముందుకురాదు. అంటే ముందస్తు ఎన్నకలు తప్పేలాలేవు. పార్టీతో రాహుల్ కసరత్తులన్నీ ఈ సంకేతాన్నే ఇస్తున్నాయి.

బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే లోక్ సభ రద్దుకావచ్చు.ఆ తతంగమంతా సజావుగా ముగించడనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనుభవం కాంగ్రెస్ కి బాగావుపయోగపడుతుంది

లోక్ సభ రద్దయిన 6 నెలల్లో ఎన్నికలు జరగాలి అంతవరకూ మన్మోహన్ సింగ్ ఆపద్ధర్మ ప్రధానిగా వుంటారు. అంటే 2013 అక్టోబర్ నవంబర్ నెలల్లో లోక్ సభ ఎన్నకలు జరిగే సూచనలు అర్ధమతున్నాయి






Friday, February 15, 2013

నియోజకవర్గమంతా బంధు,మిత్ర,సపరివారం... రాజకీయవేత్తల ఇళ్ళల్లో పెళ్ళి సాంప్రదాయం

ఇద్దరు వ్యక్తుల్ని కలిపి రెండుకుటుంబాలను దగ్గరగా చేర్చే వివాహవేడుక రాజకీయపలుకుపడి ఆర్ధిక స్తోమత వున్న చోట ప్రజల పండుగఅవుతోంది. అలాంటి పెళ్ళిపిలుపు అందుకోవడమే గౌరవం అని జనం అనుకునేలా హంగుఆర్భాటాలతో కొంతకాలం గుర్తుండి పోతున్నాయి

నియోజకవర్గంలో కనీసం ఇంటికొకరైనా వచ్చి అక్షతలువేసి విందుభోంచేసి వెళ్ళకపోతే ఎలా అనే స్ధాయిలో పెళ్ళి ఏర్పాట్లు చేయడం రాజకీయవేత్తల సాంప్రదాయం. ఆడపెళ్ళివారూ మగపెళ్ళివారూ రాజకీయనాయకులే అయినపుడు ఆపెళ్ళి పెద్ద జాతరలాగే వుంటుంది. వేలంటైన్స్ డే రాత్రి రాజమండ్రి దగ్గర సువిశాల మైదానంలో దివంగత జక్కంపూడి రామమోహనరావు కుమార్తెకు , ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడికి పెళ్ళయింది. ఆహ్వానాలు అందుకున్న రెండు ప్రాంతాల ప్రజలూ వేలాదిగా తరలిరావడంతో జాతీయరహదారిమీద టా్రఫిక్ ఆగిపోయింది. గతంలో యనమల రామకృష్ణుడు, కింజరపు ఎర్నాయుడు, తుమ్మల నాగేశ్వరరావు మొదలైన ఎందరో నాయకులు వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఇలాగే చేశారు. డబ్బు మంచినీళ్ళలా ఖర్చవ్వడం ఒక ఎత్తయితే, ప్రతీఒక్కరినీ పలకరించి భోజనశాలకు పంపే కార్యకర్తలు వారి మధ్య సమన్వయం అంతకంటే ప్రయాసనిండిన విశేషం. ఇదంతా బాగున్నప్పుడే 'బాగా పెళ్ళయిందని' ప్రజలు తృప్తి పడతారు. ఆపెళ్ళికి మేమూ వెళ్ళామని గొప్పగా చెప్పుకుంటారు




Thursday, February 14, 2013

పరవశం లేని మనిషి మనిషేనా ?

ముగ్గురు పట్టే బెంచీ మీద ఓ పడుచు జంట ఒకరినొకరు ఆనుకుని కూర్చున్నతీరు వాళ్ళ పక్కన ఇంకో నలుగురికి చోటున్నంత విశాలంగా వుంది :) ఇలాంటి సన్నివేశాలు రాజమండ్రిలాంటి చిన్న ఊళ్ళో కూడా పార్కుల్లో కనబడుతున్నాయి... వీళ్ళని చూడటం అసౌకర్యంగా వుండేది...చికాకుగా వుండేది..."ఇదొకదశ దానినుంచి మరోదశలో వారే బయటపడతారు" అని ఒక ప్రస్తావనలో ఓ ఫ్రెండ్ కామెంట్ చేశాక నా ఆలోచన మారిపోయింది

అసలు పరవశం లేని మనిషి మనిషెలా అవుతారని అనుమానమొస్తోంది. ఊపిరాడనివ్వని ఉద్రేకాలతో ఊగిపోవడం, తెరిపిలేని కుండపోతలో తడసిపోవడం, తెలిసి తెలిసి తనను కోల్పోవడం మనుషులకు ఇష్టం. పరవశం అద్బుతమైన అనుభవం. తన్మయత్వంలో తనను తాను కోల్పోవడం మనిషికి అపురూప అనుభవం

మోహంతోవున్న పడుచుజంటల మధ్య ఇలాంటి భావావేశాల రూపం ఇద్దరి మధ్యా గాలికి కూడా చోటులేనంత గాఢంగానే వుంటుంది. ఏకాంతంలో అలాంటి స్ధితి ఇద్దరికీ హద్దులు తెంచేయవచ్చు కాబట్టి పార్కుల వంటి పబ్లిక్ ప్లేసులే బెటరేమో!

స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అసహజం కాదు. అందుకు మూలమైన లిబిడోని కృత్రమంగా రెచ్చగొట్టే ఎంటర్ టెయిన్ మెంటు మీడియా వెనుక వ్యాపార మూలాల్ని ఒదిలేసి పార్కులో (వేలంటెయిన్స్ డే నాడు మాత్రమే)కనిపించే జంటలకు పెళ్ళిళ్ళు చేసేస్తామనే సంస్ధల దృష్టీ, దృక్పధాలను భరించడమే బహిరంగ కౌగలింతలు చూడటంకంటే కష్టంగా అనిపిస్తోంది


తూర్పుగోదావరి జిల్లా మురమళ్ళలో "అతిరుద్రం" విశేషాలు





Tuesday, February 12, 2013

"స్ధానిక"ఎన్నికలు - మహిళా రిజర్వేషన్ల పైనే ముఖ్యమంత్రి కిరణ్ ఆశలు?

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడానికి కాంగ్రెస్ సిద్దంగా వుందని ఉత్సాహపడటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ లెఖ్ఖుంది. అయితే జగన్ ముందు ఈ లెఖ్ఖలు తుక్కయిపోతాయని వేరువేరు మాటల్లో నలుగురు ఎమ్మెల్యేలు'తెలుగు రిపోర్టు'తో అన్నారు

తన టీమ్ సామర్ధా్యనికి సూచికలుగా ఢిల్లీ పెద్దలకు చూపించుకోడానికే సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు కిరణ్ కు ఉపయోగపడ్డాయి. 2010 అక్టోబర్ నుంచీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వున్న మున్సిపాలిటీలకు 2011 ఆగస్టునుంచీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వున్న పంచాయతీలకు ఎన్నికలు జరిగితే వాటి ఫలితాలు ప్రజల మూడ్ ని అర్ధంచేసుకోగల సూచికలయ్యే అవకాశం వుంది.

తెలంగాణా ఉపఎన్నికల గాయాలు మానని స్ధితిలో, స్ధానిక సంస్ధల ఎన్నికలకు 6 నెలలక్రితం కూడా ఆసక్తి చూపని ముఖ్యమంత్రి ఇపుడు ఎన్నికలకు సిద్ధమైపోయినట్టు ఆయన ఇంటరూ్వ్యలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ జైల్లోవుండగా గ్రామస్ధాయినుంచి ఆపార్టీ నిర్మాణమే లేకపోవడం, చంద్రబాబు పాదయాత్రలో వుండటం తమకు అనుకూలమని స్ధానిక ఎన్నికల నిర్వహణకు ఇదే అదను అని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. తన ఇందిరమ్మ యాత్రలు, సంక్షేమ కార్యక్రమాలు, స్ధానిక సంస్ధల ఎన్నికలకు ప్రతిపాదించిన రిజర్వేషన్లు కాంగ్రెస్ ను గెలిపిస్తాయన్నది కిరణ్ నమ్మకం
50%సీట్లు స్త్రీలకు రిజర్వు చేయాలన్న ప్రతిపాదనను మొత్తం కేటగిరీలలో అంటే ఎస్ సి, ఎస్ టి, బిసి, జనరల్ కేటగిరిలలో అమలు చేస్తే మొదటిసారి పదవులకు ఎన్నికైన మహిళలు వారిని ఎన్నుకున్న మహిళలు కాంగ్రెస్ వైపే వుంటారన్నది ఒక సిద్ధాంతం. ఇప్పటికే ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి అదనంగా కొత్త ఓటు బ్యాంకును సృష్టించే ఆలోచన ఇది.

చట్టపరంగాకాని ఇతరత్రాకాని మరే ఇబ్బందీలేకపోతే ముఖ్యమంత్రి అనుకున్న ప్రకారం 22 జిల్లా పరిషత్తులకు 11,- 1097 జడ్పిటిసిలకు 549,-16148 ఎంపిటిసిలకు 549,-1097 మండలాధ్యక్ష స్ధానాలకు 549,-.....ఇలా సగానికి సగం పదవులు మహిళలకు రిజర్వు అవుతాయి. 108 మున్సిపాలిటీల, 16 కార్పొరేషన్ల పదవుల్లో కూడా సగం పదవులు స్త్రీలకే కేటాయించబడుతాయి.

ఆయితే బిసి రిజర్వేషన్ల పై ఇప్పటికే ఒక వివాదం సుప్రీం కోర్టులో వుంది. రిజర్వేషన్ల అమలుకి 2001 జనాభాలెక్కల్ని ప్రాతిపదికగాతీసుకోవాలా 2011 లెక్కల్ని తీసుకోవాలా ఇంకా రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఇవేమీ సమస్యలు కాదని ఢిల్లీ సరేనంటే ఎన్నికలకు ముఖ్యమంత్రిసిద్ధమేనని పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యే ఒకరు చెప్పారు

ఇక్కడి జనం నాడి తెలియని ఢిల్లీ పెద్దల్ని రూములో కూర్చోబెట్టి చెప్పడానికిఇలాంటి లెక్కలు బాగుంటాయని ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సీట్లను జగన్ పార్టీ తన్నుకుపోవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. ముఖ్యమంత్రి మాత్రం తాడోపేడో తేల్చుకునే ఎన్నికలకే సిద్ధమౌతున్నట్టు వారి మాటల్ని బట్టి అర్ధమౌతోంది






హాయ్ బుడ్డీ!

నువ్వు బిజీగా వున్నప్పుడు కాకుండా కాస్త లీజర్ గా, రిలాక్స్ డ్ గా వున్నప్పుడే ఈ లెటర్ చదువూ!

రాత్రి చదువుకోవడం, హోంవర్క్ చేసుకోవడం అయ్యాక టివి చూస్తూ అమ్మ కేకలేశాకే నిద్రపోడానికివెళ్ళావు. పొద్దున్న ఎన్నో సార్లుకేకలేసి లేపితేగాని మెళుకువ రాలేదు. స్నానంచేశాక చాలాసేపటివరకూ నీకు బద్ధకం ఒదలలేదు. ఇది రోజూ జరిగేదే

ఇలాజరక్కుండా ఒక ఐడియా విను. నువ్వు నిద్రలేచాక మంచంకేసే చూడవు. పక్కబట్టలు చెదిరిపోయివుంటాయి.కప్పుకున్న దుప్పటి వుండలుచుట్టుకుని వుంటుంది.పనులన్నీ అయ్యాక అమ్మే పక్క సర్దుతుంది.

నువ్వు లేవగానే పక్క సర్ది దుప్పటి మడతపెట్టేశావే అనుకో అమ్మ సంబరపడిపోతుంది. నీగురించి నాన్నతో, చుట్టుపక్కల ఫ్రెండ్స్ తో గొప్పగొప్పగా చెప్పేస్తుంది. ఈ సెంటిమెంటు నీకు బాగుంటుంది కదా!

ఇందులో అంతకంటే పెద్ద ఉపయోగమే వుంది. రాత్రంతా నిద్రపోవడం వల్ల నీ కండరాలు ముడుచుకుపోతాయి కదా! లేవగానే పక్క నర్ది, మడతలు పెట్టడమంటే అది వార్మింగ్ ఎక్సర్ సైజే కదా! అంటే బద్ధకంపోయి మడ్డుతనం వదలడమే కదా!

ఇంకో విషయం - అడ్డదిడ్డంగా వున్న పరిస్ధితిని చక్కదిద్దుకోవడంతోనే రోజు ప్రారంభించడం మంచి యాటిట్యూడ్ అనిపించడంలేదూ? దీన్న లైఫ్ కి అప్లయ్ చేసుకోవడం కూడా ఒక సక్సెసే కదా! Small things makes big difference అంటే ఏమిటో అర్ధమైందికదా!

మరి రేపటినుంచీ పొద్దున మంచం దిగగానే పక్కసర్దే పని
నువ్వే చేస్తావు కదూ!

-ఫేస్ బుక్ మామయ్య



Monday, February 11, 2013

గురు ఉరిలో రాజకీయాలు లేవని కాంగ్రెస్ నమ్మింపజేస్తుందా

"అఫ్జల్ గురుని ఉరితీయడం వెనుక రాజకీయ కారణాలులేవని కేంద్రనాయకత్వం, న్యాయవ్యవస్ధ స్పష్టం చేయవలసి వుంది" జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా డిమాండ్ లాంటి స్వరంతో ఐబిఎన్ లైవ్ ఛానల్ లో ఈమాటలు చెప్పారు. అంతేకాకుండా ఆక్లిప్పింగ్ లింకుని ఇవేమాటలతో స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ముంబాయిలో టెర్రరిస్్ట దాడులో పాకీస్ధానీయుడైన అజ్మల్ కసబ్ స్వయంగా పాల్గొన్నాడనడానికి తిరుగులేని వీడియో ఫుటేజితో సహా అనేక ఆధారాలువున్నాయి. అతన్ని ఉరితీయడం వివాదం కాలేదు. పార్లమెంటుపై దాడిలో అఫ్జల్ గురు ప్రత్యక్షంగా లేడు. కోరు్ట విచారణలో గురు నేరం నిస్సందేహంగా రుజువుకాలేదన్న అభ్యంతరాలు వున్నాయి. కేవలం 'సర్కమసె్టన్స్ ఎవిడెన్స్ ' ఆధారంగా ఇంత పెద్ద శిక్ష వేయకూడదన్న వాదన వుంది. ఏమైనా పార్లమెంటు పై దాడి దేశవ్యాప్తంగా ఒక ఉద్వేగాన్ని రగిలించింది. వాదోపవాదాలను న్యాయవ్యవస్ధ ఉద్వేగాలకు అతీతంగా పరిశీలించే తీర్పు ఇచ్చిందని నమ్మే కోటాను కోట్లమందిలో నేను కూడా ఒకడిని.

ఆతనికి ఉరిశిక్ష అవసరమా కాదా అన్న చర్చలోకి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ వెళ్ళడం లేదు. అయితే పాకిస్ధాన్ పొరుగునే వున్న జమ్ము కాశ్మీర్ లో ఈ వురిశిక్ష ప్రభావం ముఖ్యంగా యువకుల మీద సుదీర్ఘకాలం వుంటుందని ఆయన ఆందోళన పడుతున్నారు.
"ఈ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేము. 1984 లో కాశ్మీర్ కు చెందిన ఉగ్రవాది మక్బుల్ భట్ ను ఉరితీసిననాటి పరిస్ధితులు వేరు. ఇపుడు యువకులు అఫ్జల్ గురు లో "తమని తాము" చూసుకుంటున్నారు" అని ఓమర్ అబ్దుల్లా వివరించారు.

గురు కుటుంబానికి చివరిసారి అతన్ని చూసే అవకాశం ఇవ్వకపోవడాన్ని ఏవిధంగానూ సమర్ధించుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు " మనం ఏకాలంలో వున్నం స్పీడ్ పోస్ట్ ద్వారా తెలియజేయడం ఏమిటి ఈ బాధ్యత ప్రత్యేకంగా ఒక అధికారికి అప్పగించి వుండొచ్చుకదా" అని అసహనాన్ని వ్యక్తంచేశారు.

అఫ్జల్ గురు ఉరి జమ్ము కాశ్మీర్ నుకలవరపెడుతోంది. 2006 లోనే కోర్టు ఉరిశిక్షవేసినా దాన్ని అమలు చేయడానికి కేంద్రప్రభుత్వం 7 ఏళ్ళ సమయం తీసుకుంది. నిర్ణయరాహిత్యాని్న దుమ్మెత్తి పోసిన బిజెపి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ ని, ప్రధాని రాజీవ్ గాంధీని చంపిన వారు ఉరిశిక్షలు పడి జైల్లో వున్నా వారిని ఉరితీయాలని డిమాండ్ చేయడం లేదు. బిజెపి హిందూత్వ భావనలు వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో అఫ్జల్ గురు శిక్షపై ఏడేళ్ళ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని'కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకే' నని ఈ శిక్షఅమలును స్వాగతిస్తున్న సామాన్యులు కూడా నమ్ముతున్నారు.

ఈ స్ధితిలో కాంగ్రెస్ తో అంటకాగడం కష్టమేనన్న నిష్టూరం ఓమర్ అబ్దుల్లా మాటల్లో గట్టిగానే ధ్వనిస్తోంది. ఏమైనా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి కోరుతున్నట్టు 'గురు ఉరితీతలో రాజకీయ కారణాలు లేవని ప్రజలను నమ్మంపజేయడం' కాంగ్రెస్ కు అసాధ్యమే అవుతుంది.
ఉరితీత ద్వారా హిందూ సమాజానికి ఓ సంకేతం ఇవ్వాలన్నదే పాలక పక్షం ఉద్దేశ్యమై వుంటే ఓమర్ అబ్దుల్లా స్పందనపై ఏ ప్రతిస్పందనా వుండదు కూడా.

Sunday, February 10, 2013

మీ జాబ్ కూర్చుని మాత్రమే చేసేదా ? అరగంటకోసారి రెండు మూడు నిమిషాలు అక్కడే తిరగండి!

పని ఒత్తిడితో కూర్చున్న చోటు నుంచి లేవకుండా అదే పనిగా విధుల్లో నిమగ్నమవుతుంటారు కొందరు. దానివల్ల ఊబకాయం సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా అరగంటకోసారి లేచి రెండుమూడు నిముషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. దానివల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మెడ, వెన్ను నొప్పి వంటివీ దూరంగా ఉంటాయి.

- రోజుకు ఒక అర్థగంట లేదా 45నిమిషాల నడక ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఉదయం నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ వ్యాయామాలలో నడక అనేది చాలా సులువైన వ్యాయామం.రోజూ ఒకగంట వాకింగ్ చేయడం మూలంగా బిపి షుగర్ను కొంత వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం వల్ల గుండెపోటు అనేది దరిచేరదు. వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడడం మానాలి.

- బలమైన ఆరోగ్యకర ఆహారాన్ని తీసు కోవాలి. ఫాస్ట్ఫుడ్స్ను తినటం మానాలి. ప్రోటీన్లు, పీచు అధికంగా ఉండే ఆహారం తీసు కోవటం అత్యుత్తమం. మొలకెత్తిన విత్తనా లలో కొబ్బరి క్యారెట్లను తురిమి కొతిమీరతో కలిపి డేట్స్తో సహా అల్పాహారంగా తీసుకోవాలి. గోంగూర, తోటకూర, పాల కూర, బచ్చలికూర లేదా క్యారట్రసం సేవించటం చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో మునగాకు అత్యంత బలమైన ఆహారం అన్న విషయాన్ని మరువకూడదు.

- ఉప్పు అధికంగా తినటం వల్ల ప్రమాదం వుంటుంది. కనుక వాటిని తగ్గించాలి. అలాగే నూనె, వేడిపదార్థాలను ఎక్కువగా తినటం మానాలి. జంక్ పుడ్స్ అసలు తినకూడదు - ఆహారాన్ని ఎప్పుడూ కూడా బాగా నమిలి తినాలి. ఆదుర్ధాగా తినడం అజీర్ణానికి దారితీస్తుంది . - అన్నంలో కూర కలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. కేలరీలు తక్కువగా ఉండి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.


భద్రత

భద్రత కల్పించలేమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేయడంతో కుంభమేళా పర్యటనను సోనియా గాంధీ రద్దు చేసుకున్నారు. నరేంద్ర మోడీ కూడా భద్రతా కారణాలవల్లే ఆ పర్యటన మానుకున్నారు

గర్భిణులూ జాగ్రత్త! కడుపులో బిడ్డలకు కాలుష్యం ముప్పు

వాయుకాలుష్యం తల్లిగర్భంలో వున్న శిశువుల ఎదుగుదలను ఆపేస్తున్నట్టు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లో లక్షమంది పిల్లలపై జరిపిన పరిశీలనలో బయటపడింది

2500 గ్రాములకంటే తక్కువ బరువుతో శిశువు పుట్టడానికి మూలం గర్భిణిగా వున్నపుడు తల్లి వాయుకాలుష్యానికిలోనుకావడమేనని తాము సేకరించిన వివరాల నుంచి శాన్ ఫ్రాన్సిక్కో లోని గైనకాలజీ ప్రోఫెసర్ టా్రసీ జె వుడ్రూఫ్ బృందం విశ్లేషించింది. బరువుతక్కువగా పుట్టిన పిల్లలో రోగనిరోధక శక్తి తగ్గి మరణాల రేటు ఎక్కువగా వుంటుంది.

పరిశ్రమల వల్ల మాత్రమేగాక వాహనాల సంఖ్య కూడా రోజూ పెరిగిపోతూండటంతో పట్టణాల్లో నగరాల్లో కాలుష్యసమస్య పెరిగిపోతోంది. పుట్టకముందే గర్భస్ధశిశువులకు ప్రాణాంతకమౌతోంది

గర్భిణులూ! వీలైనంత వరకూ వాయుకాలుష్యానికి దూరంగా వుండటమే బిడ్డలకు రక్ష!!