"ఆనాడు, ఆంత బలంగా ప్రత్యేక రాష్టా్రన్ని కోరుకున్న ప్రజలు నేడు రాష్ట్ర విభజనను ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు" వివరించడానికి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ 25 రాత్రి రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో అక్కడక్కడా వీడియో క్లిప్పింగులు చూపిస్తూ చరిత్ర ఘట్టాలను ఆసక్తికరంగా చెప్పారు. విడిపోవడానికి జనం ఎందుకు ఒప్పుకోవడం లేదో, ఎందుకు కలిసే వుండాలో ఆయన చెప్పలేదు
తెలంగాణా నాయకులు అబద్దాల విమర్శలు చేస్తూంటే సీమాంధ్రనాయకులు మాట్లాడరేంటని ప్రతీచోటా అడుగుతున్నారని ఆయనే ప్రస్తావిస్తూ " విడాకులు కోరుతున్న భార్య నానా యాగీ చేస్తున్నపుడు భర్త కూడా అలాగే మాట్లాడితే విడాకులు మంజూరైపోతాయి కాబట్టే మన మౌనం" అని బదులిచ్చారు.
రాషా్ట్రన్ని విడగొట్టవద్దని కాంగ్రెస్ హైకమాండ్ వద్ద లాబీయింగ్, వత్తిళ్ళకు పరిమితమైన సీమాంధ్రనాయకులకు గొంతివ్వడానికే అరుణ్ కుమార్ సభ దోహదపడినట్టయింది.
జై ఆంధ్ర ఉద్యమంలో సరిగ్గా 40 ఏళ్ళ క్రితం మీసా కింద అరెస్టయిన జనవరి25 నాడు "అప్పటికి ఇప్పటికి తేడాలను వివరించడానికి" ఈ సభను అరుణ్ కుమార్ ఏర్పాటుచేశారు. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఏడాదికి రెండు మూడుసార్లు నిర్వహించే సింగిల్ స్పీకర్ సభలో్ల అరుణ్ కుమార్ తప్ప వేదిక మీద ఎవరూ వుండరు..ఆయనతప్ప ఇంకెవరూ మాట్లాడరు. ఈ సారి కూడా మొదటి ఏర్పాటు అదే.
ఈలోగా ఢిల్లీలో తెలంగాణ ఇవ్వాలని టి కాంగ్రెస్ నాయకులు, విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్రనాయకులు వత్తిడి పెంచడం
...అసలు మీరేంపోరాటాలు చేశారని సీమాంధ్ర నాయకులను వాయిలార్ రవి ఈసడించడం...వారమంటే వారం కాదు...నెలంటే నెలకాదు అని తెలంగాణా నాయకులమీద గులాంనబి ఆజాద్ విసుక్కోవడం జరిగాయి.
ఈ నేపధ్యంలో అరుణ్ అంతకు ముందుగానే ప్రకటించిన రాజమండ్రి సభ ప్రాముఖ్యత పెరిగింది. విశాఖపట్టణం, విజయవాడ ఏలూరు ప్రాంతాల నుంచి అప్పటి జై ఆంధ్ర ఉద్యమ ప్రముఖులు ఇప్పటికీ ప్రత్యేక రాషా్ట్రన్ని కోరుతున్న కొద్ది మంది పెద్దలు ఇది జై ఆంధ్ర సభేకదా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. సమైక్యవాదులైన రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ లు విలేకరులను పిలిచి ఇది సమైక్యతా సభేనని 10 మంది సీమాంధ్ర మంత్రులు హాజరౌతున్నారని వివరించారు.
అరుణ్ కుమార్ మాత్రం "మీరుకూడా సభలోనే వినండి" అంటూ ఇది ఏసభో మీడియాకు స్పష్టం చేయలేదు. అరుణ్ కుమార్ కి స్పష్టత లేదనుకోలేము. ప్రజలు సహేతుకమైన అభిప్రాయానికి రావడానికి వీలుగా వాస్తవాలను ప్రజల ముందుంచడమే ఈ సభ లక్ష్యంగా ఆయన మొదట అనుకున్నారనుకోవలసి వస్తోంది.
అయితే సభ తేదీ ఖరారైపోయాక ఢిల్లీలో జరిగిన పరిణామాలు, స్ధానిక నాయకులు కూడా ఇది సమైక్యతా సభే నని ప్రచారం చేయడం తో ఎదురైన ఇబ్బంది వల్ల అరుణ్ ఉపన్యాసం చరిత్ర వరకే పరిమితమై భవిష్యత్తు దిశా నిర్దేశనానికి దూరమైనట్టు అర్ధం చేసుకోవలసి వస్తోంది.
తెలంగాణా నాయకులు అరుణ్ కుమార్ పై విరుచుకు పడటంలో ఆశ్చర్యమేమీలేదు. ఉద్యమం రాజమండ్రినుంచే ప్రారంభమైందని సమైక్యవాదులు జబ్బలు చరుచుకోవడమూ ఆశ్చర్యం కాదు. అయితే వేర్పాటు వాదానికి అరుణ్ మద్దతు ఎలా వుండదో సమైక్య పోరాటానికి కూడా ఆయన సారధ్యం వుండదు. తగాదాలో ఆలు మగల వాదన ఎలా వున్నా తీర్పు చెప్పేది పెద్దమనుషులే. రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అంతే...రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నక్కా నగేష్ అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళంతా హై కమాండ్ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించేవారే ...అలాంటి వారిలో అరుణ్ కుమార్ ముందే వుంటారు
No comments:
Post a Comment