కళంకితులను రాజకీయఅధికారంనుంచి గెంటివేయాలని కర్నాటక ఎన్నికల ఫలితాలను కూడా విశ్లేషించుకున్నాక కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తలలపై కత్తి వేలాడుతున్నట్టే.
ఒక నిర్ణయం తీసుకోవడానికి పెద్ద కసరత్తే జరుగుతుంది. అందులో మంచి చెడులు, రాజకీయంగా అంతర్గత బహిర్గత పర్యావసానాలు బేరీజువేసుకోవాలి. లంచగొండి మేనల్లుడి కారణంగా కేంద్రరైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్, సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో బొగ్గుగనుల కుంభకోణంమీద జరుగుతున్న సిబిఐ దర్యాప్తు నివేదికను మార్పించిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ పదవులు వుంచాలా వూడగొట్టాలా అనే విషయం మీద కాంగ్రెస్ కోర్ కమిటీ తీవ్రమైన మధనం చేసింది.
ప్రధాని చేతగానితనానికి ఈ మంత్రుల నిర్వాకం సరికొత్త సాక్ష్యం కాబట్టే పార్టీ వారిపదవులు ఊడగొట్టింది అనే విమర్శలు రాకూడదనుకున్నారో ఏమో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇద్దరినీ వెనకేసుకొచ్చారు. చివరికి అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా ప్రధాని నివాసానికి వెళ్ళ మాట్లాడారు. ఆతరువాత గణగణా ఫోన్లు మోగాయి. ఇద్దరు మంత్రులూ రాజీనామా చేయడం వెనువెంటనే ఆమోదించడం చకచకా ముగిసిపోయాయి. ఇంతజరిగే వరకూ పదవుల్లో వేలాడిన ఇద్దరూ చివరికి చేసినవి రాజీనామాలే అయినా నిజానికి వారిని సోనియా గాంధీ మెడపట్టి గెంటేశారనే అర్ధం చేసుకోవాలి.
ఇద్దరిని సాగనంపడం పెద్దవిషయమేమీకాదు. కళంకితులకు కాంగ్రెస్ లో చోటులేదని బలమైన సంకేతాలిచ్చే విధాన నిర్ణయమే ఇక్కడ అసలు విషయం.
కళంకితులను పక్కనపెట్టాలని ఎన్నికలకు ముందు జరిగిన కాంగ్రెస్ విధాన నిర్ణయం ఆపార్టీ అధికారంలో వున్న రాష్టా్రల్లో ప్రకంపనలనే సృష్టిస్తోంది. కళంకితులుకాని మంత్రులున్న రాష్ట్రం ఒక్కటీలేదు కాబట్టి.
ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కుంభకోణాల్లో సిబిఐ కేసులున్న మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణ రిమాండ్ ఖైదీగా జైలుపాలై పదవి కోల్పోయారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలపై కేసులున్నాయి. మరో మంత్రి శైలజానాధ్ ఈ మధ్యే మనీలాండరింగ్ వివాదంలో ఇరుక్కుపోయారు
మరో మంత్రి శైలజానాధ్ ఈ మధ్యే మనీలాండరింగ్ వివాదంలో ఇరుక్కుపోయారు
ఇప్పుడే కథ రసకందాయంలో పడుతుంది. ఈ ముగ్గురే కాదు...అవకాశాలకోసం ఎదురుచూసే కాంగ్రెస్ వాదులు ఇప్పటికే అందలాల్లో వున్న"కళంకితులను" వెతికి హైకమాండ్ ముందు నిలబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే తెరవెనుకవుండి "కళంకితులను" ఢిల్లీముందు నిలబెట్టినా ఆశ్చర్యం వుండదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా గాక అచ్చమైన ఫ్యాక్షన్ నాయకుడి మాదిరిగా ప్రతిజిల్లాలోనూ సీనియర్లకు వ్యతిరేకంగా ముఠాలను ఎగదోస్తున్న పద్ధతే ఇందుకు ఉదాహరణ. సిఎల్ పి లో చిన్నపాటి ప్రస్తావనా, చర్చాలేకుండా పైనుంచి నామినేట్ అయిన కిరణ్ హైకమాండ్ ను ప్రసన్నంగా వుంచుకోవడం మినహా ఎవరికీ జవాబుదారీని కానన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన ఒంటెత్తు పోకడలపై "అసమ్మతి" మంత్రుల సమావేశాలవరకూ వెళ్ళింది.
సొంత మనుషుల్ని మంత్రివర్గంలోకి తీసుకోడానికి, బహిరంగ ధిక్కారాలతో ఇబ్బంది పెడుతున్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని తొలగించడానికి గాని హైకమాండ్ కిరణ్ కు ఆమోదమే ఇవ్వడంలేదు.
ఈ నేపధ్యంలో కేబినెట్ లో ఎన్న ఖాళీలు వస్తే అందరు కొత్త వారిని తీసుకునే వీలు ముఖ్యమంత్రికి వుంటుంది. అసమ్మతి గొడవ కాంగ్రెస్ కు కొత్తకాదు. అయితే అత్యున్నత స్ధానంలో వున్న ముఖ్యమంత్రే అసమ్మతికి వత్తాసు యిస్తే ఆ కథే వేరుగావుంటుంది.
ఇప్పటికే "కళంకితులైన" వారి జాబితాలో "కొత్తకళంకితుల్ని" చేర్చి హైకమాండుని నమ్మించే ఎత్తులు వాటిని నిర్వీర్యం చేసే పై ఎత్తులతో ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో సందడే సందడి!!