Saturday, February 9, 2013

అఫ్జల్ గురు ఉరి పర్యావసానాలు

అఫ్జల్ గురు ఉరి ప్రభావాలు, పర్యావసానాలు గట్టిగానే వుండొచ్చు (వుండకపోనూ వచ్చు). మరణశిక్ష పడి పాకిస్ధాన్ జైల్లో మగ్గుతున్న భారతీయ శిక్కు సర్బజిత్ సింగ్ ని చంపెయ్యిలని పాకీస్ధానీయుల నుంచి ఆ ప్రభుత్వం మీద వత్తిడి పెరుగడం సహజమే. ఆసెంటిమెంటు ని పాకిస్ధాన్ అమలుచేస్తే మనదేశం శిక్కుల్లో అలజడి పెరుగుతుంది. అది మళ్ళీ ఖలిస్ధాన్ డిమాండుకి ఉపిరియిస్తుంది.

అఫ్జల్ గురు పై నేరం నిస్సందేహంగా రుజువుకాలేదని ఇందులోఆయన బలిపశువని ఇప్పటికే వాదనవున్న నేపధ్యంలో ఉరి శిక్ష అమలు కాశ్మీర్ లో అలజడులు పెంచుతుంది. సరిహద్దున అశాంతి కూడా దేశానికి మంచిది కాదు. బహుశ ఈ కారణాలవల్లే ఉరి అమలును ప్రభుత్వం ఇంతకాలమూ పెండింగ్ లో వుంచివుండవచ్చు. సమాచార సాధనాల ఆధారంగానే సామాన్య ప్రజల్లో అభిప్రాయాలు రూపుదిద్దుకుంటాయి. ప్రభుత్వాని కుండే ఇంటెలిజన్స్ వ్యవస్ధల నుంచి లభంచే ఖచ్చితమైన శాస్త్రీయమైన ఆధారాల ప్రాతిపదికగానే తుది నిర్ణయాలు వుంటాయి. ఇందువల్లే చాలా సందర్భాల్లో "పాపులర్ ప్రజాభిప్రాయాలకూ ప్రభుత్వ చేతలకూ పొంతన వుండదు. ఉన్నత స్ధాయిలో నిర్ణయరాహిత్యానికి చాలా సందర్భాల్లో వ్యక్తుల చొరవలేకపోవడం ఒక కారణమౌతుంది...ఉగ్రవాద నిర్మూలనపై అంతర్జాతీయ సానుకూలతలు.."పెద్దన్న" అమెరికా పట్టుదల, విద్యావంతులైన యువతరం జనాభాలో విస్తరిస్తున్నందువల్ల ప్రజల ఆలోచనల్లో మార్పులు కూడా నిర్ణయరాహిత్యం నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, హోంమంత్రి షిండే లను నిర్ణయం తీసుకునేవైపు నెట్టివుంటాయనిపిస్తుంది. అన్నీ అనుకూలించినా చొరవతక్కువ మనుషులైతే 'అధికారుల సలహామేరకు' ఫైళ్ళలాగే పడివుంటారు.

కసబ్,గురు ఉరిశిక్షలను కాంగ్రెస్ పార్టీ తప్పక రాజకీయప్రయోజనాలకు ఉపయోగించుకుంటుంది..ఈ పర్యావసానాల్లో ఎదురు దెబ్బలు తగిలితే షిండే బలిపశువౌతారు. ప్రణబ్ అపనిందలు మూటగట్టుకుంటారు

ఉపశమించిన ఉద్వేగం - 12 ఏళ్ళనాటి (స్వియ) అనుభవం

దుఃఖంలో వున్న మనిషిని పట్టుకుని మాటలతోనో, మౌనంగానో ఓదారుస్తున్నపుడు ఒక నిట్టుర్పు వెలువడినట్టయితే విషాదం ఉపశమించినట్టే, ఉద్వేగం చల్లబడినట్టే..అఫ్జల్ గురుని ఉరితీశారని తెలిశాక నాకు కూడా అలాగే అనిపిస్తోంది..సమాజానికి సంబంధించిన ఒక సంఘటన ప్రభావం 12 ఏళ్ళతరువాత కూడా వుంటుందా అని ఆశ్చర్యమేస్తోంది..

2001డిసెంబరు13 న పార్లమెంటుపై తీవ్రవాదులు దాడి చేసిసపుడు రాజమండ్రినుంచి వెళ్ళిన నేను(పెద్దాడ నవీన్) ,గన్నికృష్ణగారు, మధుఫోమా్ర గారు పార్లమెంటులోనే వున్నాము. లోక్ సభ స్పీకర్ బాలయోగి అసిస్టెంటు సత్తిరాజు (ఆతరువాత ఈయన కూడా బాలయోగితో పాటు హెలికాప్టర్ లో మరణించారు) మాకు గ్యాలరీ పాస్ లు తీసుకురావడానికి వెళ్ళారు. అంతలో సభవాయుదా పడింది. కారిడార్ లో నడుస్తూండగా ఎంపి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఎదురై మమ్మల్ని వెంకయ్య నాయుడుగారి పేషీలోకి తీసుకువెళ్ళారు. దారిలో అప్పటి ఎంపి, నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మాతో కలిశారు ...అందరం వెళ్ళి 8 వనెంబరు గేటు దగ్గరగా వున్న వెంకయ్య నాయుడుగారి ఆఫీస్ లో కూర్చున్నాం..నేను రామానాయుడిగారిని ఇంటర్యూ చేస్తూండగా పేలుడు శబ్దాలు వినబడ్డాయి. బాణా సంచా అనుకున్నాము. అపుడే కంగారుగా లోపలికి వచ్చిన యార్లగడ్డ " పార్లమెంటుని తీవ్రవాదులు ఆక్రమించుకున్నారట" అని చెప్పారు

మేమెంత ప్రమాదంలో వున్నామో మాకు తెలియదు. మాటలు రావడంలేదు. రామానాయుడుగారు సోఫాలో పడుకున్నారు. ఆయనకు చెమటలు పడుతున్నాయి. ఆయన నవ్వుతూ "ఫరవాలేదు హైపర్ టెన్షన్ వుంది" అన్నారు. షర్టు విప్పేయండి అని గన్ని కృష్ణ సూచించారు.

ముప్పావుగంట అలాగే వున్నాము. బయట ఏమిజరుగుతూందో తెలియదు. (టి వి వ్యాప్తిచెందుతున్న రోజులవి) మాగురించి ఇళ్ళలో ఎంత ఆందోళన పడుతున్నారో తెలియదు. మాలో మేమే మాట్లాడుకోకానికి మాటలు రావడంలేదు. దిగులు భయాందోళనల్లో మెదళ్ళు మొద్దుబారిపోవడమేమిటో అర్ధమైంది.

సెక్యూరిటీ సిబ్బంది అందరినీ పెద్ద హాళ్ళలో చేర్చారు. మేమున్న హాల్ లో 43 మందిమి చేరాము. మగవాళ్ళు ఆడవాళ్ళు వేరువేరు రాషా్ట్రల వాళ్ళు వేరు వేరు భాషలవాళ్ళు...అందరి మౌనంలో ఒకే ఆదుర్దా...ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా అన్న బెంగ..దిగులు..ఆదుర్దా..

కాస్త స్ధిమిత పడ్డాక ఆకలి బాధమొదలైంది. సత్తిరాజుగారు తెచ్చి ఇచ్చిన బిస్కెట్ పాకెట్లే అప్పటికి ఆధారం పక్కనున్నవాళ్ళతో పంచుకుని తిన్నం..రెండు సార్లు టీ ఇచ్చారు...భోజనం లేదు..తీవ్రమైన ఆకలీలేదు. పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది విడివిడిగా అందరివివరాలూ రాసుకుని బయటకు పంపారు. సత్తిరాజుగారు దగ్గరుండి రాయించడంవల్ల మేము తొందరగా సాయంత్రం 5-30 కి బయటపడ్డాము

ఆతర్వాతే తెలిసింది 11, 10, 9 నంబరుగేట్ల వద్ద తీవ్రవాదులు కాల్పులు జరుపుతున్నపుడు మేము 8 నంబరు గేటు ఎదురుగా భవనంలో వున్నామని

కేంద్ర హోంమంత్రి అద్వాని, ప్రధాని వాజ్ పాయ్ ప్రతిపక్షనాయకురాలు సోనియా గాంధి సభవాయిదా పడటం వల్ల ఆసమయానికి వెళ్ళిపోయారు. ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ సెక్యూరిటీ సిబ్బంది - పార్లమెంటు లేబుల్స్ తో తెల్ల అంబాసిడర్ కారులో వచ్చిన తీవ్రవాదుల్ని గుర్తించారు. రెండువైపులా కాల్పులు జరిగాయి.తీవ్రవాదులు మొత్తం ఐదుగురూ, ఐదుగురు పోలీసులూ ఒక సెక్యూరిటీ గార్డు, ఒక తోటమాలి కాల్పుల్లో చనిపోయారు. 18 మంది గాయపడ్డారు.

రాజమండ్రి తిరిగివచ్చాక చాలాకాలం ఈ సంఘటన నన్ను వెంటాడింది. (అనేక ఆచరణాత్మక లోపాలున్నప్పటికీ) వయోజన ఓటింగ్ ద్వారా ప్రజలందరూ భాగస్వాములుగా వున్న భారతదేశాన్ని, ప్రజల సార్వభౌమత్వాన్ని తెరమందున్న తెరవెనుకున్న కొద్ది మంది తీవ్రవాదులు దాడిచేయడం నచ్చలేదు. చైనావాళ్ళో పాకిస్థాన్ వాళ్ళో మనదేశంలో చొరబడిపోడానికి యుద్ధం చేస్తున్నపుడు వచ్చిన కోపంలాంటిదే వచ్చింది

సొంత జీవితంలో కష్టాలు సుఖాలు బాధలు - ఈ ఫీలింగ్స్ ని వెనక్కి నెట్టేశాయి. హైదరాబాద్..ముంబాయి...ఇతరప్రాంతాల్లో తీవ్రవాదుల దాడులు జరిగినపుడల్లా మానుతున్న పుండు రేగుతున్నట్టనిపించేది.అఫ్జల్ గురుని పట్టుకున్నాక, కసబ్ ని మీద విచారణ మొదలయ్యాక వివరాలు చదివి టివిలో చూసినపుడల్లా పుండుమీద ఈగ కెలుకుతున్న బాధ చికాకు కలిగేవి.. అన్యాయంగా అకారణంగా మనుషుల్ని చంపేసే వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వెనుక ఓటు బ్యాంకు ఆసక్తులు వున్నాయని గుర్తచ్చి - టివిల్లో గంభీరమైన ఉపన్యాసాలిచ్చే నాయకుల మీద అసహ్యం వేసి వేసి వేసి అదీ పలచబడిపోయింది.

కసబ్ ని ఉరితీశాక ఎన్నో ప్రాణాలకు ఒకే ప్రాణం తో బదులుతీరినట్టనిపించింది. అప్జల్ గురు ఉరి విషయం తెలిశాక మన ఇంట్లో భయపెట్టి చొరబడాలనుకున్న ఎవరికైనా ఇదే శాస్తి జరగాలనిపిస్తోంది. ఉపశమనం దొరికేవరకూ ఎంతకాలమైనా ఉద్వేగం మనిషి అంతరాలనుంచి సమసిపోదని అర్ధమైంది.

(తీవ్రవాదాన్ని సమూలంగా పెకలించలేకపోయినా) కసబ్ , ఆఫ్జల్ గురు ల ఉరివిషయంలో వెనువెంటనే నిర్ణయాలు తీసుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, హోం మంత్రి షిండేలకు జిందాబాద్ అనాలనిపిస్తోంది - పెద్దాడ నవీన్


Friday, February 8, 2013

కిరణ్ నిజంగానే నమ్ముతున్నారా నమ్మింపజూస్తున్నారా

రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధమిక సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయిగా వున్న మాట నిజం...రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ముఖ్యంగా రైతాంగానికి నచ్చడమే ఈ విజయానికి మూలమని చాటుకోడానికి ముఖ్యమంత్రికి ఇది గొప్ప అవకాశమిచ్చిన మాట నిజం...పార్టీ హైకమాండ్ ముందు నిబ్బరంగా కూర్చోడానికి కిరణ్ కుమార్ కి ఈ ఫలితాలు ఘనంగా ఊతమిచ్చాయన్నది నిజం

అయితే ఇదే బలంతో ఆయన స్ధానిక ఎన్నికలకు సిద్ధమేననడం, సత్తా తేల్చేస్తామనడం కాస్త ఆశ్యర్యకరమే
పార్టీ గుర్తులు లేకుండా, స్ధానిక అంశాలు వర్గాల సమీకరణలు, పునరేకీకరణలతో, అతి పరిమితమైన ఓటర్ల మధ్య అపారమైన ఖర్చుతో జరిగిన ఎన్నకలు ఎక్కడికక్కడ బలాలే...వాపులు కావు. అయితే వయోజనులందరూ ఓటు వేసే పంచాయితీ ఎన్నికల్లో ఈ పరిస్ధితి వుండబోదని ముఖ్యమంత్రికి తెలియదా?

Thursday, February 7, 2013

తూగోజిలో రిలీజైన "పాత సినిమా" - ప్రజల నెత్తిన బూడిద - తాగునీళ్ళలో విషం - ప్లాంటే వద్దన్నందుకు హత్యా యత్నం కేసు

పారిశ్రామిక వివాదాల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు - యాజమాన్యాలకే కొమ్ముకాస్తారని చాలా (పాత)సినిమాల్లో చూశాం. తూర్పుగోదావరి జిల్లాలో ఇపుడు ఆ సినిమాయే కనబడుతున్నట్టుంది.

బిక్కవోలు, బలభద్రపురాల్లో పురుగుమందులు, ఇతర రసాయన మిశ్రమాలు తయారుచేసే కెపిఆర్ గ్రూప్ ఆగ్రామాలకు ఆనుకునే వున్న దొంతమూరులో బొగ్గు ఇంధనంగా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ధర్మల్ ప్లాంటును నెలకొల్పడానికి నిర్ణయించుకుంది. ఇందుకు కావలసిన బొగ్గును దిగుమతి చేసుకోడానికీ యంత్రపరికరాలు దిగుమతి చేసుకోడానికీ అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే కార్యక్రమాన్ని 6 ననిర్వహిస్తున్నట్టు 2 వతేదీన చాటించారు. వ్యవధి ఇవ్వకుండా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వీరిలో హెచ్చుమంది ఆ ప్రాంతం వారు కాదని స్ధానికులు గుర్తించేశారు. ప్లాంటు ఏర్పాటు అభ్యంతరం కాదని వాంగ్మూలాలు ఇవ్వడానికే వారు వచ్చారని అర్ధమైపోవడంతో స్ధానికుల్లో ఏర్పడిన భయాందోళన ఘర్షణకు దారితీసింది. ఆందోళన కారులు రాళ్ళు రువ్వారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కలెక్టర్ ను చంపేశే ప్రయత్నం చేశారని కూడా పడాల రాము అనే యువనాయకుడి మీద కేసు నమోదైంది. ప్రజాభిప్రాయ సేకరణను కలెక్టర్ నీతూకుమారి వాయిదావేశారు

పర్యావరణ వెత్త తల్లావఝ్జుల పంతంజలి శాస్త్రి అధ్యయనం ప్రకారం అక్కడ నెలకొల్పబోయే ప్లాంటులో రోజుకి 55 టన్నుల బొగ్గుకాలుతుంది. దాని నుంచి 220 టన్నుల బొగ్గుపులుసు వాయువు వెలువడుతుంది. అది గాలిలో కలిసేలోపు ఒక శాతం అంటే 2.2 టన్నులు నేలలో కలుస్తుంది. ఇందువల్ల రేడియో ధార్మిక ఐసోటోపులు ఏర్పడి భూగర్భజలాలు కలుషితమౌతాయి.ఇది పంటలదిగుబడులమీదా ప్రజల ఆరోగ్యాల మీదా ప్రభావం చూపుతుంది. ఇంతే కాకుండా రోజూ 128 టన్నుల బూడిద వెలువడుతుంది.

ఈ కాలుష్యాలు ఉండవని కలెక్టర్ హామీఇవ్వలేదు. ప్లాంటు యాజమాన్యం ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడంలేదు. ఆ గ్రూపునకు మొదటినుంచీ విశ్వసనీయత లేకపోవడమే ఇందుకు మూలం. అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యం పక్షమే అని ప్రజలు నమ్మడానికీ ఇదే కారణం

పరిశ్రమలూ అవసరమే అందువల్ల ఏర్పడే కాలుష్య సమస్యల నివారణ అంతకంటే ముఖ్యమే. ఈ విషయంలో పారద్శకత లేకపోవవడం మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధవున్న పాతసినిమాల కాలం నుంచీ సరళీకృత ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చిన ప్రస్తుత కాలం వరకూ అలాగే కొనసాగుతూండటం విచారకరం.

Monday, February 4, 2013

సహకార సంఘాల ఎన్నికలు - చేతులెత్తేసిన తెలుగుదేశం!

మినహా సహకార ఎన్నికల్లో (ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు మినహా) తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసినట్టు స్పష్టమైపోయింది.

పదవీకాలం ముగిసేనాటికి సంఘాల అద్యక్షులుగా వున్నవారినే పర్సన్ ఇన్ చార్జ్ లుగానియమించి ఆతరువాత సభ్యత్వాల నమోదు...ఎన్నికల నిర్వహణలను ప్రభుత్వం పూర్తి చేసింది. పాత అధ్యక్షులే పర్సన్ ఇన్ చార్జ్ లుగా వుండటం వల్ల ఏర్పడిన "అనుకూలత" నుంచి పెరిగిన కాంగ్రెస్ ఓటర్ల సంఖ్య 40 వేలని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వారు అధ్యక్షులుగా వున్న సంఘాల పర్సన్ ఇన్ చార్జలు వారే కనుక వారుకూడా కొత్త ఓటర్లను చేర్పించే అవకాశం వుంది. అయితే ఖమ్మం రంగారెడ్డి జిల్లాల్లో తప్ప మరెక్కడా తెలుగుదేశం ఇందుకు పూనుకోలేదని ఫలితాలే చెబుతున్నాయి. అన్ని రకాల "వ్యయ ప్రయాసలనూ" జనరల్ ఎన్నికలకే దాచివుంచుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నట్టున్నారు. ఏమైనా సహకార సంఘాల ఎన్నికల్లో చేతులెత్తేసిన తెలుగుదేశం నాయకులు రానున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏంచేయనున్నారో చూడాలి

దిగువ స్ధాయివరకూ పార్టీ నిర్మాణమే లేని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నకల్లో తెలుగుదేశం పార్టీ కంటే బాగా కృషిచేసినట్టే వుంది. ఇది ఎక్కడి కక్కడ ఆ పార్టీ కార్యకర్తలు సాధించుకున్న ఫలితమే తప్ప పార్టీ వ్యూహాల ఫలితం ఏమాత్రమూ కాదు!

రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం ? - ఢిల్లీ ఎత్తుగడేనా !

తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి రాష్ట్రప్రభుత్వాన్ని మైనారిటీలో పడేసిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హైకమాండ్ సూచనలేకుండా ఈ పని చేశారంటే అది నమ్మేవిషయం కాదు.

ఉండవల్లి అరుణ్ కుమార్ సభకు పిసిసి రావడం ఆశ్యర్యకరంగా వుందని సభకు ముందు రాజమండ్రిలో ఒక సీనియర్ విలేకరి ప్రస్తావించినపుడు " వెళ్ళి పరిస్ధితిని ఎసెస్ మెంటు చేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం రావడం వల్లే వచ్చా" నని బొత్స బదులిచ్చారు. అటువంటి బొత్స తన పార్టీ ప్రభుత్వాన్ని మైనారిటీలోకి నెట్టేసే పనికి స్వతంత్రంగా పూనుకునే ప్రసక్తే వుండదు.

సాంకేతికంగా మైనారిటి ప్రభుత్వమే అయినా ఎవరో ఒకరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తప్ప ప్రభుత్వ మనుగడకు ముప్పులేదు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టే పరిస్ధితి లేదు. పాలకపక్షం సమస్య నుంచే వచ్చిన ఈసమస్యలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వేలుపెట్టదలచలేదు

తెలంగాణా సమస్య పరిష్కారంలో భాగంగా సమైక్య వాది అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను తొలగించే ఎత్తుగడలో భాగంగానే "ముఖ్యమంత్రులను మార్చే" కాంగ్రెస్ అనే విమర్శలేకుండా ఒక సాంకేతికతను అడ్డం పెట్టడానికే బొత్సతో బహిష్కరణ వేటుని ప్రకటింపజేశారనుకోవలసి వస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ సోనియా గాంధీతో గంట సేపు సమావేశమవ్వడం ఈ సందర్భంగా గమనార్హం. ఇదంతా గమనిస్తే రాష్ట్రప్రభుత్వాన్ని సాంకేతికంగా మైనారిటీలో పడేలా చేయడం వెనుక ఢిల్లీ హస్తం వుందని అనుకోవలసి వస్తోంది. అయితే అదెందుకన్నది త్వరలోనే తేలిపోతుంది