Saturday, April 13, 2013

తూగోజిలో 23రోజుల బాబు యాత్ర *పార్టీకి హుషారు*క్యాడర్ కి భరోసా*స్త్రీలు తక్కువ* కాపులు దూరం* యువత శూన్యం*

తూర్పుగోదావరి జిల్లాలో 11నియోజకవర్గాల్లో 16 మండలాలు, 2మున్సిపల్ కారొ్పరేషన్లు, 3మున్సిపాలిటీలు, 78గ్రామాల మీదుగా 23 రోజులపాటు 247 కిలో మీటర్లు నడచిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీలో అపూర్వమైన ఉత్తేజాన్ని నింపారు. పార్టీ కార్యకర్తల సమస్యల్ని నియోజకవర్గాల వారీగా విన్నారు. వందలాది మందిని పేరుపెట్టి పలకరించి కార్యకర్తలే పార్టీకి ప్రాణసమానులన్న సంకేతం ఇచ్చారు. ది్వతీయశ్రేణి కార్యకర్తలకు గుర్తింపు గౌరవాలను తెచ్చారు. పార్టీలో ప్రజాభిమానానికీ, అంకితమైన కార్యకర్తలకూ లోటులేక పోయినప్పటికీ నాయకులతోనే సమస్యలున్నాయన్న ఫిర్యాదులను దాదాపు ప్రతీ నియోజకవర్గ సమావేశంలోనూ విన్నారు. పరిస్ధితిని చక్కదిద్దుతామని భరోసాయిచ్చారు. నాయకత్వానికి కార్యకర్తలకూ మధ్య అగాధాన్ని అర్ధం చేసుకోడానికి ఈ యాత్ర బాబుకి ఉపయోగపడింది

పాదయాత్ర చంద్రబాబుకి కూడా గొప్ప అనుభవాన్నిచ్చింది. అతిసామాన్య ప్రజల వద్దకే వెళ్ళి నేరుగా మాట్లాడటం వల్ల వాళ్ళ జీవితాల్ని ప్రత్యక్షంగా అర్ధంచేసుకోడానికీ అనుభూతి చెందడానికీ అవకాశమొచ్చింది.

అయితే జిల్లానుంచి పక్కజిల్లా విశాఖ లోకి ప్రవేశించే ముందు తూర్పుగోదావరి సమస్యల పరిష్కారానికి ఆయన ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేయడానికి ఎన్ని వేల కోట్ల రూపాయల అవసరమౌతాయో లెఖ్ఖ చేసినట్టు లేదు. ఈ తరహా హామీలు నాయకుడి మీద పుట్టుకొచ్చిన ఆసక్తి కుతూహలాలను సహజంగానే చంపేస్తాయి. ప్రజా సమస్యలను అర్ధం చేసుకోడానికన్న ఈ యాత్ర ఎన్నికలప్రచారానికేనన్న భావనే విరివిగా వ్యాపిస్తూంది.

యాత్రలో మహిళలు పెద్దగా కనిపించలేదు. కాపులు దూరంగా నే వున్నారు. ఎస్ సిలలో అత్యధిక సంఖ్యాకులైన మాలలు దూరంగావుండగా మాదిగలు తెలుగుదేశం పట్ల సానుభూతితోవున్నట్టు అర్ధమౌతోంది

చంద్రబాబు మొదటసారి 18 ఏళ్ళక్రితం ముఖ్యమంత్రిఅయ్యారు. అప్పుడు, అంతకుముందు ఓ పదేళ్ళ క్రితం పుట్టిన వారు అంటే ఇపుడు 25 నుంచి 30 ఏళ్ళ వయసువారిమీద తెలుగుదేశం ముద్ర, చంద్రబాబు ముద్రలేదు. ఆవయసు గ్రూపు వారు చంద్రబాబు పర్యటనలో పెద్దగా కనిపించకపోవడాన్ని బట్టి యువకులు తెలుగుదేశం వైపు అంతగా లేరా అన్న అనుమానం కలుగుతోంది. ఈ గ్యాప్ ను బిజినస్ ప్రొఫెషనల్ యువకుడు, చంద్రబాబు కొడుకు నారా లోకేష్ భర్తీ చేయగలరా?

కాగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కాకరాపల్లిలో చంద్రబాబు తుని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జిల్లా పర్యటన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక డిక్లరేషన్ ప్రకటించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి ప్రాంతంలో రెండు పంటలకు సాగు నీరు అందించడంతో పాటు ఏలేరు ఆధునీకీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పుష్కర, చాగల్నాడు పధకాలను పూర్తి చేస్తామని, గోదావరి డెల్టాను ఆధునీకీకరిస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ-రాజమండ్రి ప్రాంతాన్ని వ్యవసాయ ఆధారిత కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఐటి రంగంలో ఈ రెండు నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు.

కేజి బేసిన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ను పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాలో కడియం నర్సరీలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ను నిర్మిస్తామని చెప్పారు. కాకినాడ నుండి విశాఖపట్నం వరకు ఆరు లైన్ల రహదారిని అభివృద్ధి చేస్తామని, కత్తిపూడి నుండి కృష్ణా జిల్లా పామర్రు వరకు 214 నెంబర్ జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాకినాడ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించి యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేస్తామన్నారు. అమలాపురంలో కోకోనెట్ బోర్డు ఏర్పాటు చేసి కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పారు. జిల్లాలో సహజ వనరులను అభివృద్ధి చేసి స్థానిక నిరుద్యోగులకు స్థానికంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని తెలియజేశారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అంతకు ముందు ఉదయం 10 గంటలకు చంద్రబాబుకు హైదరాబాద్ నుండి వచ్చిన డాక్టర్ రాకేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు కాలి నొప్పితో బాధపడుతుండడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని పాదయాత్రను నిలిపివేయాలంటూ వైద్యులు సూచించారు. అయినప్పటకీ చంద్రబాబు పాదయాత్రను కొనసాగించాలనే నిర్ణయించారు. అయితే షెడ్యూల్ ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసి విశాఖ జిల్లాలో మాత్రం యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు. శుక్రవారం రాత్రికే విశాఖ జిల్లాకు చేరుకున్న బాబు శృంగవరం వరకు పాదయాత్ర నిర్వహించి రాత్రి అక్కడే బస చేశారు. ఈ శని, ఆదివారాల్లో పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ నుండి చంద్రబాబు యధావిధిగా విశాఖ జిల్లాలో పర్యటిస్తారని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు చెప్పారు.


ఎన్నికల సీన్ మార్చే ఫేస్ బుక్?

బిజెపి-కాంగ్రెస్ పార్టీల మధ్య ఉత్తర భారత దేశంలో "ట్విట్టర్" యుద్ధమే జరుగుతోంది. 140 అక్షరాల కు పరిమితమైన ట్విట్టర్ ఎందువల్లనో దక్షిణ భారతదేశానికి అంతగా విస్తరించలేదు.

అయితే కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రల్లో ఫేస్ బుక్ విస్తరణ అపారంగా పెరిగిపోతోంది. యువతీ యువకులను కట్టి పడేసి, నడివయసు స్త్రీ,పురుషులను వశపరచుకుని ఐదు పదులు పైబడినవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రో యాక్టివ్, పాజిటివ్ ధింకింగ్ లాంటి నమూనాల నుంచి డిజైన్ అయిన ఫేస్ బుక్ లో "లైక్" (నచ్చడం) మాత్రమే వుంటుంది. నచ్చకపోతే ప్రత్యేకంగా కామెంటు రాయడమే తప్ప "డిస్ లైక్" లాంటి ఆప్షన్ ఏదీ వుండదు.

అంటే ఒక ప్రతిపాదన (పోస్టింగ్) నచ్చితే లైక్ పెట్టడమో, నచ్చకపోతే ఆ పోస్ట్ ని వదిలేయడమో మాత్రమే జరుగుతుంది. అంటే ఏ అంశం మీదైనా పాజిటివ్ అభిప్రాయాలు మాత్రమే లెఖ్ఖలోకి వస్తుంది. ఏకంగా ఇన్ని లైకులా అని "లైక్" మార్క్ చేసేవారిసంఖ్య తక్కువేమీకాదు.

దీని ప్రభావం చాలా ఎక్కువ. నరేంద్రమోడీ ప్రధానిగా వుండాలన్న అభిప్రాయం అతివేగంగా విస్తరించడానికి ఇలాంటి సోషల్ సైకాలజీ ప్రధాన కారణం. ఈ సూత్రాన్ని గుర్తించి మోడీ ప్రచారవ్యూహంలో ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ మొదలైన మీడియాల్లో ఆయనకోసం పనిచేసే ప్రొఫెషనల్స్, మద్దతుదారులు ముందుగా చొరబడిపోయారు. కాస్త ఆలస్యంగా కాంగ్రెస్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంది. అప్పటికే మోడీకి ఒక ఊపు వచ్చేసింది. చదువుకున్న వాళ్ళలో మధ్యతరగతి లో ప్రచారానికి సంబంధించినంత వరకూ మోడీ క్యాంపెయిన్ కి సోషల్ మీడీయా పెద్ద వేదిక అయ్యింది.

నిజమో అబద్ధమో తెరముందో తెరవెనుకో ఎవరైనా పూనుకుంటే ఫేస్ బుక్ లో అదే పనిగా ప్రచారమైపోతున్న ధోరణి ప్రస్తుతంవుంది. ఇందుకు 'కొత్తపిచ్చి' , 'వేలం వెర్రి' ప్రధాన కారణాలైతే. ఏకపక్ష వాదనను వ్యతిరేకించే (డిస్ లైక్) ఆవకాశం డిజైన్ చేయబడకపోవడం ముఖ్యకారణం. ఒకరి ప్రతిపాదన (పోస్టింగ్)ను అదే పోస్టులో కామెంటుగా ఖండించడం, వ్యతిరేకించడం సభ్యత కాదన్న సంస్కారం మరో కీలకమైన కారణం.
ఇందువల్ల హిడెన్ అజెండాలతో ఫేస్ బుక్ లో తిష్టవేసి
"బంతిని ఏకపక్షంగా దొర్లించుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే" అదేమంత కష్టంకాదు. మోడీ మద్దతు దారులు ఆయన ఇమేజ్ టి్రమ్మింగ్ కోసం ఇలాంటి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. వెంట పడిన కాంగ్రస్ వారు వెనుకే వుండిపోయారు.

ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, భారత ఇంటర్నెట్, మొబైల్ సంఘం 'సోషల్ మీడియా' లోక్సభ ఎన్నికలు' పేరిట అధ్యయనం జరిపారు. ఈ నేపధ్యంలోనే...

దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాల్లో 160 స్థానాలపై సోషల్ మీడియా అత్యంత ప్రభావం గల లోక్సభ నియోజకవర్గాలుగా సర్వే గుర్తించింది. మొత్తం ఓటర్లలో 10 శాతానికి పైగా లేదా గత లోక్సభ ఎన్నికల్లో విజేతకు వచ్చిన మెజారిటీ సంఖ్య కన్నా ఎక్కువ మంది ‘ఫేస్బుక్’ ఖాతాదారులున్న నియోజకవర్గాన్ని అత్యంత ప్రభావం గల నియోజకవర్గంగా వర్గీకరించింది. ఈ స్థానాల్లో అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించడంలో ఫేస్బుక్ ఖాతాదారుల తీర్పే కీలకం కానుందని సర్వే అభిప్రాయపడింది. ఈప్రకారం మన రాష్ట్రంలో ఫేస్బుక్ ప్రభావం పడనున్న లోక్ సభ నియోజకవర్గాలు: హైదరాబాద్,విశాఖపట్నం,విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కరీంనగర్, నరసారావుపేట, చిత్తూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు
ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 21, తరువాత గుజరాత్ లో 17 లోక్ సభానియోజక వర్గాల్లో ఈ ప్రభావం వుంటుందని అభిప్రాయపడింది.

ఉత్తరప్రదేశ్-14, కర్నాటక-12, తమిళనాడు-12, ఆంధ్రప్రదేశ్-11, కేరళ-10, మధ్యప్రదేశ్-9, ఢిల్లీ-7,హర్యానా-5, పంజాబ్-5, రాజస్ధాన్-5, బీహార్-4, చత్తీస్ ఘడ్-4, జమ్మూకాశ్మీర్-4, ఝార్కండ్-4, పశ్చిమబెంగాల్-4, ఈ స్ధానాల్లో కూడా ఫేస్ బుక్ ప్రభావం హెచ్చుగా వుంటుందని, దేశవ్యాప్తంగా మరో 67 స్ధానాల్లో ఈ ప్రభావం ఒక మోస్తరుగా వుండవచ్చని , 60 స్ధానాల్లో కనీస ప్రభావం వుండవచ్చనీ సర్వే తెలియచేసింది.

దేశవ్యాప్తంగా 256 లోక్ సభాస్ధానాల్లో ఫేస్ బుక్ ప్రభావం ఏమాత్రం వుండదని కూడా సర్వే తేల్చేసింది

ఫేస్ బుక్ లో ప్రతిపాదన అందుకు పలువురి ఆమోదం అనేది ఒక డిజైన్ గా వుంటే ట్విట్టర్ లో ఒక అభిప్రాయానికి ఆమోదం లేదా తిరస్కారం లేదా అభిప్రాయం ఏదైనా 140 అక్షరాల పరిమితిలో రాయాలి అక్కడ "లైక్" అనే ఆప్షన్ లేక పోవడంవల్ల ఒక అభిప్రాయంపై ఆలోచనే తప్ప ఫేస్ బుక్ లో మాదిగిగా అంకెల మద్దతు అది పెరిగిపోతూ వుండటమనేదే వుండదు.