Thursday, January 24, 2013

30 ఏళ్ళ రాజకీయ జీవితం కొడుకు "భవిష్యత్తుకై "ఫణం


కొడుకు రాజకీయ భవిష్యత్తుకోసం తూర్పుగోదావరి జిల్లా ప్రముఖుడు బోడ్డు భాస్కరరామారావు 30 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టేదశలో వున్నారు. తెలుగుదేశం నుంచి పెద్దాపురం ఎమ్మెల్యేగా, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ గా, అధికార పదవులు అనుభవించి, అదేపార్టీలో ఇపుడు ఎమ్మెల్సీగా వున్న బొడ్డు భాస్కరరామారావు దృష్టి ఇపుడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వుంది.

60 వపడిలో పడిన బొడ్డు భారతీయ రాజకీయ రంగంమీద  భవిష్యత్తు పాత్రలన్నీ యువతరానివేనని గ్రహించేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మైనారిటిలైన తమ చౌదరి సామాజిక వర్గానికి కేటాయిస్తున్న రాజమండ్రి లోక్ సభా స్ధానం నుంచి (హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న)తన కుమారుడికి టికెట్ అడిగి చంద్రబాబుతో లేదనిపించుకున్నారు. "గత ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు మురళీమోహన్ కే ఆ సీటు ఇవ్వవలసి వుంటుందని, ఆయువకుడు కొంతకాలం పార్టీలో పనిచేశాక తప్పక ప్రోత్సహిద్దామని" చంద్రబాబు చెప్పనప్పటినుంచీ బొడ్డు ఆలోచనలు మారిపోయాయని ఆయనతో మాట్టాడిన తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.

రాజమండ్రి లోక్ సభ సీటుపై బొడ్డు కుమారుడికి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గట్టి హామీ లభించాకే భాస్కరరామారావు స్వరం మారిందన్నది తెలుగుదేశం అంచనా. చంద్రబాబు లేఖవల్లే రాష్ట్రం విడిపోయే పరిస్ధితి వచ్చిదని బొడ్డు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "ఈ ఆగ్రహమే" ఆయన పార్టీ నుంచి వెళ్ళి పోడానికి దారిచూపిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు

సహజంగానే సంపన్నుడైన బొడ్డు కి రియల్ ఎస్టేట్ బూమ్ మరింత కలసివచ్చింది. అప్పటి అధికార పార్టీలో పాతుకుపోయి వుండటమే బాగా కలసిరావడానికి దోహదపడింది. ఆపేరు ప్రఖ్యాతులు కమ్మ సామాజిక వర్గం లో ఈయన్నిప్రముఖంగా నిలబెట్టాయి.

రెడ్డివర్గం ముద్రవున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సామాజిక వర్గం మద్దతు బాగా అవసరమైనందువల్లే బొడ్డు భాస్కరరామారావుకి ఆపార్టీ నుంచి ఆకర్షణీయమైన హామీ లభించివుండవచ్చన్నది ఓ విశ్లేషణ. బోడ్డు తన సామాజిక వర్గం తో పార్టీ మార్పిడిపై మంతనాలు జరుపుతున్నారు. వారిలో పెద్దలు నవ్వేసి ఊరుకుంటూండగా యువకులు మాత్రం బొడ్డు ఆలోచనల్ని తీవ్రంగా మొరటైన భాషతో విమర్శిస్తున్నారు

ప్రజల ఆకాంక్షల్ని బట్టి పార్టీలు మారడం వేరు. వ్యక్తిగత, కుటుంబ ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు మారడం వేరు. ఈ దిగజారుడుతనం ఆకస్మికంగా సంపదలు వచ్చిపడిన న్యూరిచ్ కుటుంబాల్లో కనబడుతుంది. భూస్వాముల్లో (సాధారణంగా) వుండదు. వారిలో నిబద్ధత ఓ ప్రత్యేకత. అటువంటి కుటుంబీకుడైన బొడ్డు భాస్కరరామారావు లో నిబద్ధత చెదరిపోతూండటం విలువల పతనానికి ఓ తార్కాణమే!

1 comment:

  1. As you said it, Naveen garu, it was degradation of values. Money and position counts more than money for many and Bhaskararama Rao is one of the examples.

    ReplyDelete