Saturday, March 9, 2013

'గేమ్ ఛేంజి' మొదలైందా! జగన్ మొదటి గంట

ఒక పార్టీ అభ్యర్ధుల జాబితా ప్రకటించగానే సామాన్య ప్రజల్లో కూడా చిన్న హుషారు కనబడటం ఆ పార్టీ బాగా చొచ్చుకు పోయిందనడానికి ఒక సంకేతం. గెలిచినా, ఓడినా ముందు ఎత్తువేసిన వాడి ప్రభావం ఆట మీద తప్పనిసరిగా వుంటుంది

ఎమ్మెల్యేల కోటానుంచి ఎమ్మెల్సీ ను ఎన్నుకోడానికి వందేళ్ళు పైబడిన కాంగ్రెస్ అభ్యర్ధుల ఖరారు పై ఇంకా లెక్కతేల్చుకోకముందే, మూడుపదులు నిండిన తెలుగుదేశం మీన మేషాలు లెక్కబెడుతూండగానే, అక్రమ ఆస్తుల కేసులో అధ్యక్షుడు జైల్లోవున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా శాసనసభకు పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితానే "సమన్వయ కర్త" పేరుపెట్టి విడుదల చేసేసింది.

వై ఎస్ విజయమ్మ, డాక్టర్ మైసూరారెడ్డి, సోమయాజులు మొదలైనవారు చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని జగన్ ఆమోదించాక జాబితా విడుదల చేశారు. చాలా స్ధానాలకు ఒకరే సమన్వయ కర్తలు వుండగా కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు కూడా వున్నారు. సమన్వయ కర్తలకే అసెంబ్లీ టికెట్ అని పేర్లు చూస్తనే అర్ధమైపోతోంది. ఎక్కువమంది వున్నచోట వారు మొదట ఏకాభిప్రాయానికి రావాలి.పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది.

జాబితాను విశ్లేషిస్తే సామాజిక సమీకరణల ఫార్ములాను ఈ పార్టీ కూడా ఏమాత్రం పక్కన పెట్టలేదని స్పష్టమైపోతోంది. ఎన్ టి ఆర్ మినహా ఫార్ములాను పక్కన పెట్టిన నాయకుడు మరెవరూ కనిపించరు.

52 అసెంబ్లీ సీట్లున్న రాయలసీమలో 39 చోట్ల సమన్వయకర్తలను ప్రకటించారు. ఇందులో 30 మంది రెడ్డి కులస్తులే.ఇక ఉత్తరాంధ్రాలో బిసిలకు గోదావరి జిల్లాల్లో కాపులు బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి చేరినవారిని కూడా చోటిచ్చారు. "మొత్తంమీద సెలక్షన్ బాగుందనిపించే" ముద్రను వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిజాబితా వేసుకుంది.

పార్లమెంటు సీట్లు, తెలంగాణాలో అసెంబ్లీ సీట్ల జాబితాలను వ్యూహాత్మకంగా ప్రకటించలేదు.

ఈ జాబితా చూసి ఆయా సమీకరణల ప్రాతిపదికగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ ఎంపికలను సవరించుకోవడమో మార్చుకోవడమో చేసుకోక తప్పదు.

గెలిచినా, ఓడినా ముందు ఎత్తువేసిన వాడి ప్రభావం ఆట మీద తప్పనిసరిగా వుంటుంది

జగన్ దగ్గరవున్నది నీతిబద్ధమైన సంపద అని ఎవరూ నమ్మరు. రాజకీయ ప్రయోజనాలకోసమే నిద్రనటించి నోరుమూసుకున్న కాంగ్రెస్ ఆకస్మికంగా అవినీతి కేసులు మోపి ఆయన్ని జైలుకి పంపింది. జగన్ అవినీతిని ఎండగట్టడమే పనిగా అసలుపనిగా సొంతపనిమానేసి మరీ తెలుగుదేశం ఊదరగొట్టింది.

యాత్రవల్లా, నిరంతరం ఏదో విధంగా జనంలో వుండటం వల్లా జగన్ ఎన్నికల ఎజెండా నుంచి అవినీతిని గెంటేశారనిపిస్తోంది. మేము అతి స్వచ్ఛమని చెప్పుకోగల స్ధితి ఏపార్టీకి ఏనాయకుడికి లేకపోవడం కూడా ఇందుకు ముఖ్యకారణమే. 40 ఏళ్ళలోపువారు 65 శాతానికి చేరుతున్న యువభారతంలో జగన్ 'గేమ్ ఛేంజర్' 'అయ్యారని' అని ఆపార్టీ అభిమానులు అంటూండగా 'అవుతారని' విశ్లేషణలు సూచిస్తున్నాయి.


Friday, March 8, 2013

సోనియా టాప్

అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండసీ్ట్ర(అసోచామ్), జీ బిజినెస్ చానెల్ నిర్వహించిన వ్యాపార సర్వేలో సోనియా అత్యంత ప్రజాదరణ కలిగిన మహిళగా స్ధానం పొందారు. ఆతర్వాత స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందా కోచ్చర్ ఉన్నారు. బీజేపీ నేత సుష్మా స్వరాజ్ 16 స్థానం, జయలలిత 17వ స్థానాన్ని, మమత బెనర్జీ 20 స్థానాన్ని దక్కించుకున్నారు.



Thursday, March 7, 2013

ఆదిరెడ్డి ఎంపికలో చాతుర్యం! బాగున్న జగన్ 'కళ్ళూ-చెవులూ'?

పదవులకోసం విపరీతమైన పోటీవున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటిల్ మెంటు్ల మొదలు పెట్టినట్టుంది. రాజమండ్రి సిటి నియోజకవర్గం నుంచి ఆపార్టీ టికెట్ కోసం పట్టు వదలని ప్రయత్నం చేసిన ఆదిరెడ్డి అప్పారావుకి ఎమ్మెల్యేల కోటానుంచి శాసన మండలి అభ్యర్ధిగా ప్రకటించారు.

రాజమండ్రి సిటి స్ధానం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా సుప్రసిద్ధ వస్త్ర వ్యాపారి, దేవాంగ, ఇతర బిసికులాల సంక్షేమ సంఘాల నాయకుడు బొమ్మన రాజ్ కుమార్ ఇప్పటికే 'గడపగడపకూ' తిరుగుతున్నారు.

తెలుగుదేశం స్ధానిక సీనియర్ నాయకుడూ, కొప్పువెలమ కుల ప్రముఖుడూ, రాజమండ్రి మాజీ మేయర్ వీరరాఘవమ్మ భర్తా, తెలుగుదేశంలో దివంగత ప్రముఖుడు ఎర్రన్నాయుడు వియ్యంకుడూ అయిన ఆదిరెడ్డి ఆప్పారావు రాజమండ్రి సిటి సీటుని ఆశించి - బొమ్మన కంటే ముందుగానే వై ఎన్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. బొమ్మనకే టికెట్ అని జగన్ చెప్పాక కూడా ఆదిరెడ్డి పట్టువిడువని ప్రయత్నం ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ తెచ్చిపెట్టింది. ఆపార్టీకున్న సంఖ్యాబలం రీత్యా ఈయన ఎమ్మెల్సీ అవుతారు.

రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో ప్రచారం చేసుకోవాలని పండ్ల వ్యాపారీ, కాపు ప్రముఖుడు, దివంగత నేత జక్కంపూడి రామమోహనరావు ప్రముఖ అనుచరుడు ఆకుల వీర్రాజు కి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. జైలు వద్ద ములాఖాత్ లో జగన్ స్వయంగా వీర్రాజుకి ఈ విషయం చెప్పారని, పిలిచి ఇచ్చిన ఈ ఆవకాశం శుభసూచకమని వీర్రాజు మద్దతుదారులు సంబరపడిపోతున్నారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జక్కంపూడి విజయలక్ష్మి పోటీ చేయగలరని అందరూ భావించారు. నరసాపురంకాంగ్రస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడితో ఇటీవలే ఈమె వియ్యమందటంతో రాజకీయంగా మరింత బలపడ్డారు. జక్కంపూడి అనుచర సహచర బలగం ఒక్క నియోజకవర్గానికిమాత్రమే పరిమితమై వుండేది కాదు. ఆయన మరణానంతరం ఆ వెలుగు కాస్త మసకబారింది. సెటిల్మెంట్ల వివాదాల్లో కుటుంబీకుల పేర్లు అపుడపుడూ వినిపిస్తూంటాయి. ఈ నేపధ్యంలో రాజమండ్రి రూరల్ టికెట్ ను పిలిచి మరీ ఆకుల వీర్రాజుకి ఇవ్వడం గమనార్హం.

అయితే కాపుసామాజిక వర్గం నేపధ్యం వల్ల జక్కపూడి కుటుంబాన్ని విస్మరించే పరిస్ధితి వుండదు. రాజమండ్రి పక్కనే వున్న రాజానగరం నియోజక వర్గంలో కాపులు కమ్మలు సమానంగా వుంటారు . కులబలం గట్టిగా వున్న జక్కంపూడి విజయలక్షి్మకి గట్టి పోటీ వుండే రాజానగరం సీటుని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ రిజర్వ్ చేసినట్టు కనిపిస్తోంది.

జైల్లో వుండటం కూడా క విధంగా జగన్ కు 'బయట నుంచివత్తిడి లేకుండా' నిర్ణయాలు తీసుకోడానికి ఉపయోగపడుతోంది. అయితే ఈ నిర్ణయాల వెనుక ఒక పటిష్టమైన నెట్ వర్క్ ఆయనకు కళ్ళూ, చెవులుగా పనిచేస్తున్నాయని 'రాజమండ్రి నిర్ణయాలే' వెల్లడిస్తున్నాయి.


Wednesday, March 6, 2013

తెలుగుదేశం బిజెపితో సెట్టవుతుందా?

ఏపార్టీకీ ప్రజలు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వని సంకీర్ణరాజకీయాలు ముఖ్యంగా స్ధానిక, ప్రాంతీయ పార్టీలకు ప్రాణసంకటమే! తెలుగుదేశం పార్టీ ఇపుడు ఇలాంటి సంకటంలోనే పడినట్టుంది

సంకీర్ణరాజకీయాల్లో పార్టీల పాత్ర వేరుగా వుంటుందని బిజెపితో జతకట్టినప్పుడు, ఆబంధం వొదిలించుకుని కమ్యూనిస్టులతో దోస్తీ కుదుర్చు కున్నప్పుడు చంద్రబాబు తరచు చెప్పేవారు. ఎన్ని భాష్యాలు చెప్పుకున్నా, ఫలితాలు మాత్రం ఒకోసారి 'చారత్రక తప్పిదాలు' అయిపోతూంటాయి. ఈసారైనా అలాంటి తప్పిదాలు చేయరాదన్న స్వరాన్ని తెలుగుదేశంలోని బిజెపి సానుభూతి పరులు పెంచుతున్నారు.

దేశంలో బిజెపికి అనుకూలమైన గాలి మొదలైంది. బిజెపి నాయకత్వంలోని ఎన్ డి ఎ ఈ సారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని రకరకాల సర్వేలు సూచిస్తున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ భావి ప్రధానికాగలరన్న సూచనలు ఆపార్టీ కార్యకర్తల్లో ఊపు పెంచడమేకాక సామాన్య ప్రజల ఆలోచనల్ని కూడా బిజెపి వైపు ఆకర్షిస్తున్నాయి

తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు మాజీమంత్రి పెద్దిరెడ్డి "బిజెపి కి దేశమంతా అనుకుకూలంగా వుందని" వ్యాఖ్యానించడం తెలుగుదేశంలో బిజెపి కి అనుకూలమైన మూడ్ కి ఒక సంకేతమనిపిస్తోంది.

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తో ఎమ్ ఐ ఎమ్ పొత్తు ఇకలాంఛనం మాత్రమే. టి ఆర్ ఎస్ ఒంటరిగానే పోటీచేస్తుంది. తాజా మిత్రుల్లో సిపిఐ మాత్రమే తెలుగుదేశం జతగా అంతంత మాత్రంగా వుంది. సిపిఎం తెలుగుదేశంతో స్నేహాన్ని రిన్యువల్ చేసుకోవాలో లేదో ఇంకా తేల్చుకోలేదు.

తెలుగుదేశం బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడు బిజెపి ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి. వామపక్షాలతో పొత్తు పెట్టుకుననప్పుడు మాత్రం ఆపార్టీల సొంత ఓట్లు తెలుగుదేశానికి పూర్తిగా పడలేదు.

దేశంలో తృతీయ ప్రత్యామ్నాయమనే ఆశే ప్రస్తుతానికిలేదు. 2014 ఎన్నికల్లలో విజయం సాధించలేకపోతే తెలుగుదేశం మనుగడే కష్టమౌతుంది. ఈ నేపధ్యంలో బిజెపితో అవగాహనకు సిద్ధపడకతప్పదని చంద్రబాబు మీద పార్టీనుంచే వత్తిడి పెరుగుతుంది. అందుకు పెద్దిరెడ్డి వ్యాఖ్యలే నాంది అనిపిస్తున్నాయి.

తెలుగుదేశం సరేననాలేగాని బిజెపి సై అననడానికి పెద్దగా ఇబ్బంది వుండదు. అంతగా పటిష్టపడని ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎదుగుదలకు తెలుగుదేశం గట్టి అండ అవుతుందన్న బిజెపి నాయకులే రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు






Monday, March 4, 2013

ఇదో 'అంతులేని కథ' తేల్చుకోలేక పోతున్నా : జయప్రద

"భవిష్యత్తు రాజకీయాల్లో ఏపాత్ర నిర్వహించాలో తేల్చుకోలేకపోతున్నా త్వరలో నిర్ణయించుకుంటా" అన్నారు ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న నటి జయప్రద

స్వస్ధలమైన రాజమండ్రిలో ఒక జ్యూయెలరీ షాపుని సోమవారం ఉదయం ఆమె ప్రారంభించారు. విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ ఏపార్టీలో వుండాలి ఎక్కడినుంచి పోటీ చేయాలి అనే విషయాలు తేల్చుకోలేకపోతునా్ననని రాజమండ్రినుంచే ప్రజాసేవ చేయాలని ఆశిస్తున్నానని అన్నారు

తన ఉత్తరప్రదేశ్ ప్రస్ధానం అక్కడ పదవీకాలం ముగిశాక ఆంధ్రప్రదేశ్ కు రావలసిన అవసరం మొదలైన అంశాలను ప్రస్ధావిస్తూ తన కష్టాలు అనుభవాలు కూడా తాను నటించిన సినిమా 'అంతులేని కధ' లాగే వున్నాయన్నారు

రాష్ట్రం కలసివుంటేనే బాగుంటుందనుకుంటున్నానన్నరు
రాష్ట్రంలో నే తనరాజకీయాలువుంటాయని ఆవిషయమై త్వరలో నిర్ణయం తీసుకోగలననీ అన్నారు

(వై ఎస్ స్టైలే ?) పార్టీకంటే పెద్దదౌతున్న మోడీ నీడ!

బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆదివారం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి వ్యాఖ్యానాలు బిజెపి కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్దం దిశను మార్చేసే దశగా కనిపిస్తున్నాయి.

బిజెపి 2009 ఎన్నికల తరువాతనుంచి చైతన్యాన్ని క్రమంగా కోల్పోతూండగా కార్పొరేట్ బినామీల వ్యవహారంలో అప్పటి బిజెపి అధ్యక్షుడు గడ్కారి చిక్కుకోవడంతో పార్టీ మరింత మసకబారినట్టయింది. ఇంకోవైపు మోడీ 'సుపరిపాలన' విదేశాల్లో కూడా ఖ్యాతిగడిస్తోంది.'లక్షలాది కార్యకర్తలవల్లే ఇదంతా' అని మోడీ నమ్రతా భావాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఆయన ఇమేజ్ మాత్రం బిజెపికంటే చిక్కగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తగానే కాంగ్రెస్ కంటే ఎలా ఎత్తుకి ఎదిగిపోయారో మోడీ బిజెపిలో అంతకు మించిపోయారు.

నాయకులు కూడా ఒకవిధమైన స్తబ్ధతతో వుండగా జాతీయ కౌన్సిల్ సమావేశపు వేదికను మోడీ చాకచక్యంగా వినియోగించుకున్నారు. "ఆకుటుంబం కోసం దేశాన్నే కాంగ్రస్ తాకట్టుపెట్టేసింది , ఆకుటుంబ వాచ్ మన్ లా బలహీన ప్రధానిని దేశానికి ఇచ్చంది" అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు బిజెపి యుద్ధలక్ష్యం 'ఆకుటుంబమే' అనే సూచనను ఇస్తున్నాయి. ప్రణబ్ 'ముఖర్జీ ప్రధాని అయివుంటే దేశానికి కొంతైనా మేలు జరిగేది' అన్న మోడీ మాటల్లో కాంగ్రెస్ లో చిచ్చు పెట్టే వ్యూహం కనబడుతోంది.

2014 ఎన్నకల్లో బిజెపి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీనే ప్రకటించేలా చూడటానికి ప్రతీ అవకాశాన్నీ వాడుకుంటున్న మోడీకి ప్రతీసారీ క్యాడర్ ని ఘనంగా ఉత్తేజపరుస్తూనే వున్నారు. ప్రధాని పదవికి అభ్యర్ధిగా ప్రకటింపచేసుకునే ప్రయాణంలో వేగంగా మెట్లెక్కేస్తూనే వున్నారు.




Students in Higher Education Trends






Sunday, March 3, 2013

అమితాబ్ కి జర్నలిస్టుగా పుట్టాలని వుంది


"మరుజన్మలోనా? ఖచ్చితంగా విలేకరినౌతా...పర్యావసానాలగురించి భయపడకుండా..అనుకున్నది మాట్లాడే, వ్యక్తీకరించగలిగే స్వేచ్ఛ-ఆనందాలూ ఆస్వాదిస్తా"
పరిచయం అక్కరలేని సెలిబ్రిటి అమితాబ్ బచ్చన్ శనివారం నాటి ట్విట్టర్ పోస్టింగ్ కి ఇది తెలుగు అనువాదం
అమితాబ్ ప్రతీరాత్రీ కనీసం గంటన్నర బ్లాగింగ్ చేస్తారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా ఆయన రాసినవి సోషల్ నెట్ వర్స్్క లో విస్తరిస్తూ వుంటాయి.
@SrBachchan హ్యాండిల్ (యూజర్ నేమ్) తో 2010 మే నుంచి ట్విట్టర్ లో వున్న అమితాబ్ ఫాలోయర్ల సంఖ్య రోజూ పెరిగిపోతూ ఇప్పటికి 45 లక్షలు దాటింది.
అంటే ఆయన ట్విట్టర్ లో ఏం రాసినా అంతమందికి చేరుతుందన్న మాట