Thursday, January 31, 2013

ఎకరం భూమి-20మంది కౌలుదారులు - సహకారఎన్నికల "మాయ" - జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశం దొస్తీ!

ప్రాధమిక సహకార పరపతి సంఘాలఎన్నికలు ఆయా ప్రాంతాల్లో వ్యక్తులు గ్రూపుల ఆధిక్యత నిలబెట్టుకునే వేదికలుగా మారిపోయాయి. ఇవి పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నకలు కాకపోయినప్పటికీ పోటీ పడుతున్నవారిలో హెచ్చుమంది ఏదో ఒక రాజకీయ పార్టీలో చురుకైన పాత్ర వహించేవారే. గ్రామ స్ధాయిలో పార్టీ నిర్మాణం జరగకపోయినా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ మీద ఆదరణను గుర్తించిన పెద్దలు ఆపార్టీ వారికి అవకాశం లేకుండా చూడటానికి చేతులు కలుపుతున్నారు. పాత రాజకీయ శత్రువులు మిత్రులైపోతున్నారు. ఈ పునరేకీకరణల ఫలితంగా కాంగ్రెస్ తెలుగుదేశం గ్రూపులు రాజీపడ్డాయి. అవగాహనకు వచ్చాయి.

ద్రవ్యోల్భణం వల్ల చేతిలో డబ్బులేక సహకార ఎన్నికల్లో ఓట్లు కొనలేని స్ధితిలో పోటీలేకుండా ఏకగ్రీవం సర్దుబాట్లు సగానికి సగం సంఘాల్లో జరిగంది. వీటికి 2 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి బహుమతి కూడా లభిస్తుందికూడా. తూర్పుగోదావరిజిల్లాలో మొదటిదశగా 133 సంఘాలకు ఎన్నికలు జరగాలి అయితే ఏకగ్రీవంగా ఎన్నికైనవిపోను 66 సంఘాలకే పోలింగ్ అవసరమైంది. ఇంచుమించు రాష్ట్రమంతా ఇదే పరిస్ధితి వుంది

గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వ ఉనికి మనుగడల కోసం ఈ సర్దుబాట్లు తప్పవు. ఇది అవకాశవాదమైతే కేంద్రంలో నానాపార్టీల ప్రభుత్వాన్ని ఏమనాలని వేమగిరిలో నామా రత్తయ్య అనే రైతు ప్రశ్నించారు. అయితే ఈ ఎన్నికల్లో కలసిపోయినవారే అసెంబ్లీ ఎలక్షన్లలో రక్తం చిందేలా పోట్లాడుకుంటారు.

భూమి యజమానులు వ్యవసాయాలు మానేసి పట్టణాలకు వెళ్ళిపోతున్న ధోరణి విస్తరిస్తోంది. రైతుకూలీలు కౌలుదారులౌతున్నారు. రుణాలకోసమో ప్రకృతివైపరీత్యాల్లో సహాయంకోసమో కౌలుదారులకు కౌలుపత్రాలు కావాలంటే భూయజమానులు ఇవ్వరు. ఆపత్రమే కౌలుహక్కుకి సాక్ష్యమై భవిష్యత్తులో భుమి చేజారిపోతుందన్న భయం అందుకు కారణం. అయితే సహకార సంఘాల ఎన్నికల్లో ఓటుహక్కు కౌలదారులకూ వుంది. దీంతో వ్యవసాయం లేనివారిని కూడా కౌలుదారులుగా రికార్డుల్లో చూపించి ఓటర్లుగా నమోదుచేయడం ప్రతిచోటా జరిగింది. ఒకే ఎకరం పొలం మీద 10 నుంచి 20 మంది నికూడా కౌలుదారులుగా పత్రాలు ఇచ్చి ఓటు హక్కు ఇప్పించిన సంఘటనలు కూడా చాలా చోట్ల వున్నాయి. 5 నుంచి 10 సెంట్ల భూమిలో వ్యవసాయ రికార్డుల్లో సాధ్యమే కాని నిజంగా వీలుపడదు

సంఘాల పదవీకాలం ముగిశాక అధికారులను ఇన్ చార్జ్ లుగావుంచి ఎన్నికలు జరపడం పరిపాటి. కిరణ్ కుమార్ ప్రభుత్వం మాత్రం సంఘాల అధ్యక్షులనే పర్సన్ ఇన్ చార్జ్ లుగా నియమించింది ఆతరువాత కొంతకాలానికి ఇపుడు ఎన్నికలు జరుగుతున్నాయి.ఇందువల్ల మాజీ అధ్యక్షులు తమకు వీలుగా నమోదు మొదలైన ఏర్పాట్లు చేసుకునే వీలుకుదిరింది. ఆలాగని ఫలితాల్లో పాతఫలితాలే మళ్ళీ వస్తాయనుకునే వీలులేదు.

Wednesday, January 30, 2013

రాజకీయ అనిశ్చిత - "పోలవరం" ఆగేనా సాగేనా

పూర్తవుతుందో లేదో తెలియని పోలవరం ప్రాజెక్టు కూడా వేర్పాటు, సమైక్య వివాదంలో చిక్కుకుంది. రాష్ట్రం విడిపోకుండా, నీటిపంపకాలు తేలకుండా ప్రాజెక్టుని కట్టనిచ్చేది లేదని టి ఆర్ ఎస్ గట్టిగా చెబుతోంది. ఇప్పటికే 3 వేలకోట్ల రూపాయల ఖర్చయిన ప్రాజెక్టుని ఎలా ఆపుతారన్నది సీమాంధ్ర నాయకుల ప్రశ్న.

పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా, కృష్ణా నదికి 80 టి ఎంసిల నీరు ఇచ్చేలా, 650 మెగావాట్ల జలవిద్యత్తు ఉత్పత్తి చేసేలా, బహుళ ప్రయోజనాలకోసం 150 అడుగుల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడానికి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం డిజైన్ చేసింది. ఈ డిజైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, ఒరిస్సా రాషా్ట్రల్లో ముంపునకు గురయ్యే 207 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఈ ప్రకారం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 17 వేలకోట్లరూపాయలు అవసరమౌతాయి. ప్రాజెక్టు కట్టకముందే ఎక్కడాలేని విధంగా కాల్వల తవ్వకం మొదలు పెట్టారు. ఇపుడవి పూడిపోతున్నాయి కూడా. వై ఎస్ మరణించాక ఆపనులు నత్తనడకగా వున్నాయి. కొద్దిపాటి పనులు జరుగుతున్నా కోర్టు లిటిగేషన్లు అడ్డు పడుతున్నాయి.

తెలంగాణా వారు వద్దంటున్న, సీమాంధ్రులు కావాలంటున్న స్ధితిలో ఈ ప్రాజెక్టు విషయమై నిర్ణయం తీసుకునే సావకాశం, తెగువ, సంకల్పం, రాష్ట్రప్రభుత్వానికి లేదు. ఒకవేళ వున్నా నిధులు లేవు. కేంద్రాన్ని నిధులడగడానికి "ఇపుడది అవసరమా" అన్న ప్రశ్న ఎదురౌతుందని సంకోచం.

రాజకీయ అనిశ్చిత తోపాటు పునరావాసానికి సంబంధించిన సవాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు ముందున్నాయి.
సోనియా గాంధీ చైర్ పర్సన్ గావున్న జాతీయ సమగ్రతా మండలి జారీచేసిన మార్గదర్శకసూత్రాల ప్రకారం ఒక ప్రతిపాదిత ప్రాజెక్టు కింద మునిగిపోయే జనావాసాల ప్రజల్లో 50 శాతానికి మించి షెడ్యులు తెగలు కులాల వారుంటే ఆ ప్రాజెక్టుకి ఆనుమతి ఇవ్వకూడదు. పోలవరం ప్రాజెక్టుకోసం ఖాళీచేయవలసినవారు పూర్తిగా ఎస్ టి లే. ఈ స్ధితిలో అనుమతి ఎలా వస్తుందన్నది పెద్ద ప్రశ్న.

విద్తుత్ ఉత్పాదన లేకుండా ప్రాజెక్టు ఎత్తుని 150 నుంచి 100 అడుగులకు తగ్గంచి పోలవరాన్ని కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మారిస్తే ఇందుకు ఖాళీ చేయించవలసిన గ్రామాలు 54 ఉంటాయని అవికూడా ఖమ్మం జిల్లాలోవేనని సిపిఎం పార్టీ డిజైన్ మార్పుని సూచించింది.ఇందువల్ల ఇతర రాష్టా్రల అనుమతుల ప్రమేయమే వుండదు.

కాంటా్రక్టర్ల నుంచి ముందుగానే లంచాలు గుంజుకోవడానికే ప్రాజెక్టు కంటే ముందుగా కాల్వల పనులు ఇచ్చేశారన్న సమంజసమైన హేతుబద్ధమైన విమర్శలను ఎదుర్కొంటూ కూడా మొండిగా సాగిపోయిన వై ఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక దుర్మరణం తరువాత పోలవరం ప్రాజెక్టుని పట్టించుకున్న రాజకీయ సంకల్పం, నాయకత్వం లేకపోవడంతో ఈ భారీ ప్రాజెక్్ట అనాధ అయిపోయింది. లాంచన ప్రాయమైన బడె్జట్ కేటాయింపులతో ప్రాజెక్టు బతికే వుంది. ఈ ఖర్చులే తడిసి మోపెడైనట్టు 3 వేల కోట్ల రూపాయలకు చేరాయి.

రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగే వరకూ ఆగని ఖర్చులతో పూర్తికాని పనులతో ఎప్పటికీ ముగియని టివి సీరియల్ కథలా పోలవరం ప్రాజెక్టు సాగుతూ వుంటుంది

Monday, January 28, 2013

ఆజాద్ రాయలసీమనూ రాజేస్తున్నారా?

రాష్ట్ర రాజకీయవేదికమీద కొన్నేళ్ళుగా "తెలంగాణా" , "సీమాంధ్ర" పాత్రలే ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. "జై ఆంధ్ర", "ఉత్తరాంధ్ర", "రాయలసీమ" నినాదాలు అపుడపుడూ వినబడుతున్నా వాటి ప్రాధాన్యత ఇంతవరకూ పెద్దగా లేదు. కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ 'ఇంకా చర్చలు జరగవలసివుంది మూడు ప్రాంతాల నాయకులనూ పిలిచి మాట్లాడాలి. పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రిలను పిలిచి మాట్లాడాలి' అని కొత్తగా ప్రకటించడం ద్వారా "సీమాంధ్ర" ఐక్యత నుంచి రాయలసీమను వేరుగా చూడాలన్న సంకేతం ఇస్తున్నట్టయింది.

28 కల్లా సమస్యను పరిష్కరిస్తామన్న హోం మంత్రి షిండే హామీ యుపిఎ ప్రభుత్వం ఇచ్చినది కాగా, మూడుప్రాంతాల నాయకులతో మాట్లాడిన తరువాతే అంటున్న ఎఐసిసి ప్రధానకార్యదర్శి ఆజాద్ ప్రకటన కాంగ్రెస్ విధానంగా స్పష్టమౌతోంది. రాజమండ్రి సభ అనంతరం రేగిన ఉద్రిక్తతల నేపధ్యంలో అజాద్ ప్రకటన రాయలసీమలో వేర్పాటు వాదానికి తెరతీసేదిగా వుంది.

మనుషుల్ని ప్రాంతాలవారీగా చీల్చేసి పబ్బం గడుపుకోవాలన్న దుర్నీతి కాంగ్రెస్ కి కొత్తేమీ కాదుకదా!