Thursday, March 14, 2013

జనం మెచ్చని అవిశ్వాసం కథ

కాంగ్రెసేతర రాజకీయ పార్టీలన్నీ ఏకమైతే రాష్ట్రప్రభుత్వం కూలిపోతుంది. అయితే స్వియ ప్రయోజనాలను ఒదిలేసి 'అవిశ్వాస ఎజెండా' కిందికి పార్టీలన్నీ రావడం అసాధ్యమని 'నిశ్చింత' గా వున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రమే కాదు... 'ఇది జరిగే పని కాదని' సామాన్య ప్రజలకు కూడా అర్ధమైపోయింది. ఇందువల్లే 'ఏదో జరగబోతోందన్న ఆదుర్దా, ఆసక్తి' టివిల ముందు కనిపించడంలేదు.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ఏడాదిముందు రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చివేయడం మీద ఆసక్తిలేదు. ఒకవేళ కూల్చేసినా ఇష్టంలేని టి ఆర్ ఎస్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. లేదా మధ్యంతర ఎన్నికలకు కారణమవ్వాలి. ఈ తలనొప్పులు లేకుండా ప్రజాతీర్పు ద్వారానే ఏడాది తరువాత అధికారంలోకి రావాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రజల మధ్యేతిరుగుతున్నారు.

తెలంగాణా సాధనే అజెండాగా కాంగ్రెస్ మీద వత్తిడి పెంచడంలో భాగంగానేమో ఆ పార్టీని ఒకసారి ప్రేమిస్తూ ఒకసారి ద్వేషిస్తూ కాలంగడుపుతున్న టిఆర్ఎస్ కి కొత్తగా వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది మొదలైంది. సీమాంధ్రలో చొచ్చుకుపోతున్న జగన్ పార్టీ తెలంగాణాలో కూడా ప్రవేశిస్తే టి ఆర్ ఎస్ బలహీనపడుతుందని ఆపార్టీ కేడర్లే అనుమానపడుతున్నాయి. తెలంగాణా ఇవ్వాలంటే సీమాంధ్రలో బలహీన పడవచ్చన్న అనుమానం జగన్ పార్టీకీ వుంది. ఈ నేపధ్యాల వల్ల ఈ రెండు పార్టీలూ ఒక అవగాహనకు వచ్చాయన్న నమ్మకం రాజకీయవర్గాలన్నిటిలోనూ వుంది. ఇలావుంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అక్రమసంబంధం వుందని కెసిఆర్ పార్టీ, జగన్ పార్టీ విడివిడిగా ఆరోపిస్తున్నాయి.

తెలంగాణా సాధనే ఏకైక ఎజెండాగా వున్న టి ఆర్ ఎస్ కి కాంగ్రస్ తో సిద్ధాంతవైరుధ్యమేదీ లేదు. కాంగ్రస్ మీద జగన్ పార్టీ విమర్శలు రాషా్ట్రనికే పరిమితం. "మత తత్వ" బిజెపితో చేతులు కలిపేదిలేదని ఆ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. వచ్చే ఎన్నకల తరువాత అవసరాన్ని బట్టి యుపిఎ కి మద్దతు ఇచ్చే అవకాశాన్న విజయమ్మే స్వయంగా సూచించారు. ఇలాంటిషఎజెండాలతో వున్న ప్రతి పక్షాలు రెండూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశాన్ని దుమ్మెత్తి పోస్తన్నాయి.

రాజకీయవిమర్శల మాటెలావున్నా ప్రభుత్వాన్ని కూల్చివేయడం చిన్నవిషయం కాదు. అన్నిపార్టీలూ ఏకాభిప్రాయానికి రావాలి. కలసి కూర్చుని చర్చించుకోవాలి. నోటీసు ఇవ్వాలి. సభలో చర్చజరగాలి. ఓటింగ్ కు వెళ్ళాలి...అసలు కసరత్తేమీ లేకుండా మీడియా ముఖంగా అవిశ్వాసం పెడుతున్నామని ప్రకటించేసి మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ తో కుమ్మక్కయినట్టేనని...అదీ మీడియా ముఖంగానే బ్లాక్ మెయిల్ చేసే దశకు టి ఆర్ ఎస్ - వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరుకున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై నెరవేరని అవిశ్వాస తీర్మానాన్నిపెట్టిన టి ఆర్ ఎస్ - అందుకు కలసిరావడం లేదన్న ఆరోపణపై సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్ధితిని చంద్రబాబుకి కల్పించడం, ఇందుకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వంతపాడటం చూస్తే ఈ పార్టీల లక్ష్యం కాంగ్రెస్ కాదని తెలుగుదేశమేననీ అర్ధమైపోతోంది.

ప్రజాప్రయోజనాలకోసంనిధుల కేటాయింపులపై చర్చలు జరగవలసిన బడ్జెట్ సమావేశాన్ని రాజకీయాలకోసం (ఈ సారి) దుర్వినియోగంచేసిన టి ఆర్ ఎస్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు లోతైన చర్చలేకుండా బడ్జెట్ ఆమోదించబడేలా కాంగ్రస్ పార్టీకి పరోక్షంగా తోట్పడటం కూడా గమనార్హం.

పార్టీ కార్యక్రమమైన "మీకోసం వస్తున్నా" యాత్రలో నిమగ్నమైపోయిన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షనాయకుడు అయివుండీ ప్రజా ప్రయోజనాలు ఇమిడి వున్న బడ్జెట్ సమావేశాలకు గైరుహాజరవ్వడం కూడా గమనార్హం.

ఇదంతా చూస్తే రాజకీయనాయకులందరూ కలిసి ప్రజలమీదే అవిశ్వాసం ప్రకటించారనుకోవలసి వస్తోంది






No comments:

Post a Comment