Saturday, February 9, 2013

ఉపశమించిన ఉద్వేగం - 12 ఏళ్ళనాటి (స్వియ) అనుభవం

దుఃఖంలో వున్న మనిషిని పట్టుకుని మాటలతోనో, మౌనంగానో ఓదారుస్తున్నపుడు ఒక నిట్టుర్పు వెలువడినట్టయితే విషాదం ఉపశమించినట్టే, ఉద్వేగం చల్లబడినట్టే..అఫ్జల్ గురుని ఉరితీశారని తెలిశాక నాకు కూడా అలాగే అనిపిస్తోంది..సమాజానికి సంబంధించిన ఒక సంఘటన ప్రభావం 12 ఏళ్ళతరువాత కూడా వుంటుందా అని ఆశ్చర్యమేస్తోంది..

2001డిసెంబరు13 న పార్లమెంటుపై తీవ్రవాదులు దాడి చేసిసపుడు రాజమండ్రినుంచి వెళ్ళిన నేను(పెద్దాడ నవీన్) ,గన్నికృష్ణగారు, మధుఫోమా్ర గారు పార్లమెంటులోనే వున్నాము. లోక్ సభ స్పీకర్ బాలయోగి అసిస్టెంటు సత్తిరాజు (ఆతరువాత ఈయన కూడా బాలయోగితో పాటు హెలికాప్టర్ లో మరణించారు) మాకు గ్యాలరీ పాస్ లు తీసుకురావడానికి వెళ్ళారు. అంతలో సభవాయుదా పడింది. కారిడార్ లో నడుస్తూండగా ఎంపి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఎదురై మమ్మల్ని వెంకయ్య నాయుడుగారి పేషీలోకి తీసుకువెళ్ళారు. దారిలో అప్పటి ఎంపి, నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మాతో కలిశారు ...అందరం వెళ్ళి 8 వనెంబరు గేటు దగ్గరగా వున్న వెంకయ్య నాయుడుగారి ఆఫీస్ లో కూర్చున్నాం..నేను రామానాయుడిగారిని ఇంటర్యూ చేస్తూండగా పేలుడు శబ్దాలు వినబడ్డాయి. బాణా సంచా అనుకున్నాము. అపుడే కంగారుగా లోపలికి వచ్చిన యార్లగడ్డ " పార్లమెంటుని తీవ్రవాదులు ఆక్రమించుకున్నారట" అని చెప్పారు

మేమెంత ప్రమాదంలో వున్నామో మాకు తెలియదు. మాటలు రావడంలేదు. రామానాయుడుగారు సోఫాలో పడుకున్నారు. ఆయనకు చెమటలు పడుతున్నాయి. ఆయన నవ్వుతూ "ఫరవాలేదు హైపర్ టెన్షన్ వుంది" అన్నారు. షర్టు విప్పేయండి అని గన్ని కృష్ణ సూచించారు.

ముప్పావుగంట అలాగే వున్నాము. బయట ఏమిజరుగుతూందో తెలియదు. (టి వి వ్యాప్తిచెందుతున్న రోజులవి) మాగురించి ఇళ్ళలో ఎంత ఆందోళన పడుతున్నారో తెలియదు. మాలో మేమే మాట్లాడుకోకానికి మాటలు రావడంలేదు. దిగులు భయాందోళనల్లో మెదళ్ళు మొద్దుబారిపోవడమేమిటో అర్ధమైంది.

సెక్యూరిటీ సిబ్బంది అందరినీ పెద్ద హాళ్ళలో చేర్చారు. మేమున్న హాల్ లో 43 మందిమి చేరాము. మగవాళ్ళు ఆడవాళ్ళు వేరువేరు రాషా్ట్రల వాళ్ళు వేరు వేరు భాషలవాళ్ళు...అందరి మౌనంలో ఒకే ఆదుర్దా...ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా అన్న బెంగ..దిగులు..ఆదుర్దా..

కాస్త స్ధిమిత పడ్డాక ఆకలి బాధమొదలైంది. సత్తిరాజుగారు తెచ్చి ఇచ్చిన బిస్కెట్ పాకెట్లే అప్పటికి ఆధారం పక్కనున్నవాళ్ళతో పంచుకుని తిన్నం..రెండు సార్లు టీ ఇచ్చారు...భోజనం లేదు..తీవ్రమైన ఆకలీలేదు. పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది విడివిడిగా అందరివివరాలూ రాసుకుని బయటకు పంపారు. సత్తిరాజుగారు దగ్గరుండి రాయించడంవల్ల మేము తొందరగా సాయంత్రం 5-30 కి బయటపడ్డాము

ఆతర్వాతే తెలిసింది 11, 10, 9 నంబరుగేట్ల వద్ద తీవ్రవాదులు కాల్పులు జరుపుతున్నపుడు మేము 8 నంబరు గేటు ఎదురుగా భవనంలో వున్నామని

కేంద్ర హోంమంత్రి అద్వాని, ప్రధాని వాజ్ పాయ్ ప్రతిపక్షనాయకురాలు సోనియా గాంధి సభవాయిదా పడటం వల్ల ఆసమయానికి వెళ్ళిపోయారు. ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ సెక్యూరిటీ సిబ్బంది - పార్లమెంటు లేబుల్స్ తో తెల్ల అంబాసిడర్ కారులో వచ్చిన తీవ్రవాదుల్ని గుర్తించారు. రెండువైపులా కాల్పులు జరిగాయి.తీవ్రవాదులు మొత్తం ఐదుగురూ, ఐదుగురు పోలీసులూ ఒక సెక్యూరిటీ గార్డు, ఒక తోటమాలి కాల్పుల్లో చనిపోయారు. 18 మంది గాయపడ్డారు.

రాజమండ్రి తిరిగివచ్చాక చాలాకాలం ఈ సంఘటన నన్ను వెంటాడింది. (అనేక ఆచరణాత్మక లోపాలున్నప్పటికీ) వయోజన ఓటింగ్ ద్వారా ప్రజలందరూ భాగస్వాములుగా వున్న భారతదేశాన్ని, ప్రజల సార్వభౌమత్వాన్ని తెరమందున్న తెరవెనుకున్న కొద్ది మంది తీవ్రవాదులు దాడిచేయడం నచ్చలేదు. చైనావాళ్ళో పాకిస్థాన్ వాళ్ళో మనదేశంలో చొరబడిపోడానికి యుద్ధం చేస్తున్నపుడు వచ్చిన కోపంలాంటిదే వచ్చింది

సొంత జీవితంలో కష్టాలు సుఖాలు బాధలు - ఈ ఫీలింగ్స్ ని వెనక్కి నెట్టేశాయి. హైదరాబాద్..ముంబాయి...ఇతరప్రాంతాల్లో తీవ్రవాదుల దాడులు జరిగినపుడల్లా మానుతున్న పుండు రేగుతున్నట్టనిపించేది.అఫ్జల్ గురుని పట్టుకున్నాక, కసబ్ ని మీద విచారణ మొదలయ్యాక వివరాలు చదివి టివిలో చూసినపుడల్లా పుండుమీద ఈగ కెలుకుతున్న బాధ చికాకు కలిగేవి.. అన్యాయంగా అకారణంగా మనుషుల్ని చంపేసే వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వెనుక ఓటు బ్యాంకు ఆసక్తులు వున్నాయని గుర్తచ్చి - టివిల్లో గంభీరమైన ఉపన్యాసాలిచ్చే నాయకుల మీద అసహ్యం వేసి వేసి వేసి అదీ పలచబడిపోయింది.

కసబ్ ని ఉరితీశాక ఎన్నో ప్రాణాలకు ఒకే ప్రాణం తో బదులుతీరినట్టనిపించింది. అప్జల్ గురు ఉరి విషయం తెలిశాక మన ఇంట్లో భయపెట్టి చొరబడాలనుకున్న ఎవరికైనా ఇదే శాస్తి జరగాలనిపిస్తోంది. ఉపశమనం దొరికేవరకూ ఎంతకాలమైనా ఉద్వేగం మనిషి అంతరాలనుంచి సమసిపోదని అర్ధమైంది.

(తీవ్రవాదాన్ని సమూలంగా పెకలించలేకపోయినా) కసబ్ , ఆఫ్జల్ గురు ల ఉరివిషయంలో వెనువెంటనే నిర్ణయాలు తీసుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, హోం మంత్రి షిండేలకు జిందాబాద్ అనాలనిపిస్తోంది - పెద్దాడ నవీన్


No comments:

Post a Comment