పారిశ్రామిక వివాదాల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు - యాజమాన్యాలకే కొమ్ముకాస్తారని చాలా (పాత)సినిమాల్లో చూశాం. తూర్పుగోదావరి జిల్లాలో ఇపుడు ఆ సినిమాయే కనబడుతున్నట్టుంది.
బిక్కవోలు, బలభద్రపురాల్లో పురుగుమందులు, ఇతర రసాయన మిశ్రమాలు తయారుచేసే కెపిఆర్ గ్రూప్ ఆగ్రామాలకు ఆనుకునే వున్న దొంతమూరులో బొగ్గు ఇంధనంగా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ధర్మల్ ప్లాంటును నెలకొల్పడానికి నిర్ణయించుకుంది. ఇందుకు కావలసిన బొగ్గును దిగుమతి చేసుకోడానికీ యంత్రపరికరాలు దిగుమతి చేసుకోడానికీ అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే కార్యక్రమాన్ని 6 ననిర్వహిస్తున్నట్టు 2 వతేదీన చాటించారు. వ్యవధి ఇవ్వకుండా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వీరిలో హెచ్చుమంది ఆ ప్రాంతం వారు కాదని స్ధానికులు గుర్తించేశారు. ప్లాంటు ఏర్పాటు అభ్యంతరం కాదని వాంగ్మూలాలు ఇవ్వడానికే వారు వచ్చారని అర్ధమైపోవడంతో స్ధానికుల్లో ఏర్పడిన భయాందోళన ఘర్షణకు దారితీసింది. ఆందోళన కారులు రాళ్ళు రువ్వారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కలెక్టర్ ను చంపేశే ప్రయత్నం చేశారని కూడా పడాల రాము అనే యువనాయకుడి మీద కేసు నమోదైంది. ప్రజాభిప్రాయ సేకరణను కలెక్టర్ నీతూకుమారి వాయిదావేశారు
పర్యావరణ వెత్త తల్లావఝ్జుల పంతంజలి శాస్త్రి అధ్యయనం ప్రకారం అక్కడ నెలకొల్పబోయే ప్లాంటులో రోజుకి 55 టన్నుల బొగ్గుకాలుతుంది. దాని నుంచి 220 టన్నుల బొగ్గుపులుసు వాయువు వెలువడుతుంది. అది గాలిలో కలిసేలోపు ఒక శాతం అంటే 2.2 టన్నులు నేలలో కలుస్తుంది. ఇందువల్ల రేడియో ధార్మిక ఐసోటోపులు ఏర్పడి భూగర్భజలాలు కలుషితమౌతాయి.ఇది పంటలదిగుబడులమీదా ప్రజల ఆరోగ్యాల మీదా ప్రభావం చూపుతుంది. ఇంతే కాకుండా రోజూ 128 టన్నుల బూడిద వెలువడుతుంది.
ఈ కాలుష్యాలు ఉండవని కలెక్టర్ హామీఇవ్వలేదు. ప్లాంటు యాజమాన్యం ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడంలేదు. ఆ గ్రూపునకు మొదటినుంచీ విశ్వసనీయత లేకపోవడమే ఇందుకు మూలం. అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యం పక్షమే అని ప్రజలు నమ్మడానికీ ఇదే కారణం
పరిశ్రమలూ అవసరమే అందువల్ల ఏర్పడే కాలుష్య సమస్యల నివారణ అంతకంటే ముఖ్యమే. ఈ విషయంలో పారద్శకత లేకపోవవడం మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధవున్న పాతసినిమాల కాలం నుంచీ సరళీకృత ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చిన ప్రస్తుత కాలం వరకూ అలాగే కొనసాగుతూండటం విచారకరం.
No comments:
Post a Comment