తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి రాష్ట్రప్రభుత్వాన్ని మైనారిటీలో పడేసిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హైకమాండ్ సూచనలేకుండా ఈ పని చేశారంటే అది నమ్మేవిషయం కాదు.
ఉండవల్లి అరుణ్ కుమార్ సభకు పిసిసి రావడం ఆశ్యర్యకరంగా వుందని సభకు ముందు రాజమండ్రిలో ఒక సీనియర్ విలేకరి ప్రస్తావించినపుడు " వెళ్ళి పరిస్ధితిని ఎసెస్ మెంటు చేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం రావడం వల్లే వచ్చా" నని బొత్స బదులిచ్చారు. అటువంటి బొత్స తన పార్టీ ప్రభుత్వాన్ని మైనారిటీలోకి నెట్టేసే పనికి స్వతంత్రంగా పూనుకునే ప్రసక్తే వుండదు.
సాంకేతికంగా మైనారిటి ప్రభుత్వమే అయినా ఎవరో ఒకరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తప్ప ప్రభుత్వ మనుగడకు ముప్పులేదు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టే పరిస్ధితి లేదు. పాలకపక్షం సమస్య నుంచే వచ్చిన ఈసమస్యలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వేలుపెట్టదలచలేదు
తెలంగాణా సమస్య పరిష్కారంలో భాగంగా సమైక్య వాది అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను తొలగించే ఎత్తుగడలో భాగంగానే "ముఖ్యమంత్రులను మార్చే" కాంగ్రెస్ అనే విమర్శలేకుండా ఒక సాంకేతికతను అడ్డం పెట్టడానికే బొత్సతో బహిష్కరణ వేటుని ప్రకటింపజేశారనుకోవలసి వస్తోంది.
ముఖ్యమంత్రి కిరణ్ సోనియా గాంధీతో గంట సేపు సమావేశమవ్వడం ఈ సందర్భంగా గమనార్హం. ఇదంతా గమనిస్తే రాష్ట్రప్రభుత్వాన్ని సాంకేతికంగా మైనారిటీలో పడేలా చేయడం వెనుక ఢిల్లీ హస్తం వుందని అనుకోవలసి వస్తోంది. అయితే అదెందుకన్నది త్వరలోనే తేలిపోతుంది
No comments:
Post a Comment