నిజానికి, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నెగ్గింది. ఈ విషయం తెలిసి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి, చర్చకు తీసుకుని వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించి ఉంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెమటలు పట్టి ఉండేవి. ఆ ఆందోళన నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు చాలా ముందుగానే బయటపడేశారు.
అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రికి ఆయన ఊరట కలిగించారు. దాంతో ముఖ్యమంత్రిలో ఎక్కడలేని ధీమా పెరిగింది. ప్రభుత్వం బయటపడిందని తెలియగానే పోటీ తెలుగుదేశం పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య నెలకొంది. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తోంది. వైయస్ విజయమ్మ సహా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ప్రధానంగా చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా వైయస్సార్ కాంగ్రెసును, ముఖ్యంగా వైయస్ రాజశేఖర రెడ్డిని, వైయస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు సంధించారు. మోత్కుపల్లి నర్సింహులు వైయస్ రాజశేఖర రెడ్డిని, వైయస్ జగన్ను వదిలిపెట్టలేదు. వారిద్దరిపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విద్యుత్తు, తదితర సమస్యలపై మాట్లాడారు. తన ప్రసంగం చివరలో మాత్రం వైయస్ జగన్పై, వైయస్సార్ కాంగ్రెసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య జరిగిన పోటీలో ఎవరు గెలిచారనేది ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలు కూడా తమ తమ స్వరూపాలను బయటపెట్టుకున్నాయని అంటున్నారు. తెలంగాణపై వైయస్సార్ రాజశేఖర రెడ్డి వైఖరిని తెరాస సభ్యులు దుమ్మెత్తిపోశారు. అయినా, వైయస్సార్ కాంగ్రెసు వారిని పల్లెత్తు మాట అనలేదు. చంద్రబాబును మాత్రమే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించారు. కాంగ్రెసు సభ్యులు కూడా ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెసుపై దృష్టి పెట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తమ నాయకుడిగా చెప్పుకుంటూనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దుమ్మెత్తిపోశారు.
అయితే, అవిశ్వాస తీర్మానం విషయంలో తెరాస తెలివిగా వ్యవహరించిందనే మాట వినిపిస్తోంది. మామూలుగా అయితే, తెలంగాణపై మాట్లాడడానికి సమయం దొరకదు కాబట్టి, దొరికినా ఎక్కువ సమయం దొరకదు కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని సాకుగా చేసుకుని తెలంగాణపై చెప్పాల్సిందంతా చెప్పారని అంటున్నారు. ప్రజా సమస్యలపై తెరాస సభ్యులు తక్కువగా మాట్లాడి తెలంగాణపై ఎక్కువగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు వైఖరిని నిలదీశారు.
పైగా, లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ వంటి చాలా మంది ఇతర సభ్యులు తెలంగాణపై కాంగ్రెసు వైఖరిని తప్పు పట్టారు. ఆ రకంగా తెలంగాణపై విస్తృతమైన చర్చకు తెరాస అవిశ్వాస తీర్మానం ద్వారా దారులు వేసుకుందనే మాట వినిపిస్తోంది. అయితే, తమ ప్రభుత్వం చేసిన, చేస్తున్న కార్యక్రమాలను వివరించడానికి ముఖ్యమంత్రికి మంచి అవకాశం లభించిందని అంటున్నారు. మొత్తం మీద, అవిశ్వాస తీర్మానంపై ఒటింగుకు వచ్చేసరికి ముఖ్యమంత్రి అందరి దృష్టిని ఆకర్షించారు. విపక్షాలు తేలిపోయి, అధికార పక్షం నిలిచినట్లే కనిపించింది.
No comments:
Post a Comment