Saturday, March 2, 2013

'బడ్టెట్' తలనొప్పికి స్టాండింగ్ కమిటీలే మందు! - కిరణ్ ఐడియా






బడ్జెట్ సమావేశాల కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి సారిగా పార్లమెంటు తరహాలో రెండు విడతలుగా సమావేశమౌతోంది. మార్చి 13 న సమావేశాలు మొదలౌతాయి. 18 ఆర్ధికమంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. 23 వరకూ చర్చజరుగుతుంది. ఓట్ ఆన్ అకౌంట్ తీసుకున్నాక సభవాయుదా పడుతుంది. ఏప్రిల్ 23 నమళ్ళీ సమావేశమై మే 15 వరకూ కొనసాగుతుంది.
ఓట్ ఆన్ అకౌంట్ తరువాత వాయిదా పడినప్పటినుంచీ తిరిగి సమావేశమయ్యేవరకూ వున్న విరామకాలంలో స్టాండింగ్ కమిటీలు సమావేశాలు జరుపుతాయి. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలను సంబంధిత స్టాండింగ్ కమిటీలు క్షుణ్ణంగా చర్చించి నివేదికలు రూపొందిస్తాయి. రెండో విడత సమావేశంలో కమిటీల సూచనలు దాదాపు యధాతథంగా అమలౌతాయి. లేదా సభ సూచనమేరకు సవరణలు వుండవచ్చు.
కేంద్రబడ్జెట్ పై లోక్ సభ, రాజ్యసభ సభ్యుల తో ఏర్పాటయ్యే స్టాండిగ్ కమిటీలు చేసేపనినే ఇపుడు రాష్ట్రంలో స్టాండిగ్ కమిటీలు చేస్తాయి. ఆర్ధికమంత్రి తదితరులు ఈ తరహా ఏర్పాట్లను పరిశీలించి వచ్చాక ఇచ్చిన నివేదిక ననుసరించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి సారి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో శాఖలవారీగా కొద్దినెలల క్రితమే స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది
ప్రతిపక్షాలు అధికారపక్షం పరస్పరం దుమ్మెత్తిపోసుకోడానికే సభాసమయం చాలని ధోరణి పెరిగిపోతూన్న కాలం కావడంతో ప్రతి బడ్జెట్ లో చాలా భాగాలు చర్చలేకుండానే ఆమోదించబడుతున్నాయి. అంశాలవారీగా ప్రతీ అంశాన్నీ సభలో చర్చించాకే బడ్జెట్ ను ఆమోదించిన సందర్భం 1990 దశకం తరువాత (తెలుగుదేశం హయాంలో) లేనేలేదు
కిరణ్ ప్రభుత్వానికి జగన్ పార్టీలో చేరి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెడదవుంది. బడ్జెట్ సమావేశంలో వారు వ్యతిరేకంగా ఓటు వేస్తే రాజకీయంగానూ రాజ్యాంగపరంగానూ కూడా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం వుంది. బడ్జెట్ ఆమోదం లేకుండా జీతభత్యాల వంటి కనీస అవసరాల చెల్లింపులు కూడా చేయకూడదు. ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా చెల్లింపుల నుంచి గట్టెక్కవచ్చు.ఇందుకు అన్ని పార్టీలూ సహకరిస్తాయి. ఆయితే ఆతరువాత చర్చల్లో మామూలు దుమె్మత్తిపోతలకు దెప్పిపోట్లు కూడా అదనమౌతాయి.
బడ్జెట్ సమావేశపు 'మైనారిటీ' చిక్కుముడిని తప్పించుకోవడమే కాక మీడియాలో విస్తృతంగా ప్రసారమైయ్యే విమర్శలను కూడా తగ్గించుకోవచ్చన్న కిరణ్ ఐడియా పర్యావసానమే పార్లమెంటు తరహా స్టాండింగ్ కమిటీల ఏర్పాటుగా కనిపిస్తోంది
ఇందువల్లే బడ్జెట్ సమావేశాలకోసం పాదయాత్ర ఆపుకోవలసిన అవసరంలేదని ప్రధాన ప్రతిపక్షనాయకుడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారా?

No comments:

Post a Comment