కొత్త రైల్వే బడ్జెట్లో ప్రయాణికులపై మరోమారు భారం మోపేందుకు కేంద్ర రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ భావిస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కొత్త రైల్వే బడ్జెట్ను మంగళవారం మంత్రి బన్సల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
ఈ రైల్వే బడ్జెట్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. అయితే సరకు రవాణా ఛార్జీలతో పాటు ప్యాసింజర్ టిక్కెట్ ఛార్జీలను పెంచుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. వడ్డన మాత్రం పాక్షింగానైనా ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.
డీజెల్ ధరలు పెరగడంవల్ల రవాణా ఛార్జీలను పెంచాలన్న తలంపులో మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల చమురు మార్కెటింగ్ కంపెనీలు డీజెల్ ధరలు పెంచడం వల్ల రైల్వేలపై భారం పడింది. జనవరి నుంచి బల్క్ వినియోగదారులపై సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో లీటరు డిజెల్ రూ.10 చొప్పున పెరిగింది. బల్క్ వినియోగదారులపై డీజెల్ ధరలను పెంచడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు సమర్థించుకుంటున్నాయి.
అదే ప్యాసింజర్ ఛార్జీలను పెంచితే రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి . ఇప్పుడు తాజా సరకు రవాణా చేసే వారు కూడా రైల్వేలు సరకు రవాణా ఛార్జీల పెంపుపై ఒక పరిమితి ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్యాసింజర్ టిక్కెట్లపై వస్తున్న నష్టాన్ని తమపై రుద్దడం ఏమిటని వారు నిలదీస్తున్నారు.
పారిశ్రామిక రంగానికి చెందిన లాబీ సీఐఐ కూడా జోక్యం చేసుకుని రైల్వేలు సరకు రవాణా చార్జీలు పెంచాలంటే మూడు నెలలు ముందు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఆందోళనల నడుమ ప్రభుత్వం మరోమారు ప్రయాణికులపై భారం పెంచినా పెంచొచ్చు ... లేదా బడ్జెట్లో రైల్వేలకు అదనంగా కేటాయింపులు చేసే అవకాశాలు లేకపోలేదని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుండగా, రైల్వేలు ప్యాసింజర్ సర్వీసుల కారణంగా సంవత్సరానికి రూ.23,000 కోట్ల మేరకు నష్టాలను చవిచూస్తోంది.
No comments:
Post a Comment