పదవులకోసం విపరీతమైన పోటీవున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటిల్ మెంటు్ల మొదలు పెట్టినట్టుంది. రాజమండ్రి సిటి నియోజకవర్గం నుంచి ఆపార్టీ టికెట్ కోసం పట్టు వదలని ప్రయత్నం చేసిన ఆదిరెడ్డి అప్పారావుకి ఎమ్మెల్యేల కోటానుంచి శాసన మండలి అభ్యర్ధిగా ప్రకటించారు.
రాజమండ్రి సిటి స్ధానం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా సుప్రసిద్ధ వస్త్ర వ్యాపారి, దేవాంగ, ఇతర బిసికులాల సంక్షేమ సంఘాల నాయకుడు బొమ్మన రాజ్ కుమార్ ఇప్పటికే 'గడపగడపకూ' తిరుగుతున్నారు.
తెలుగుదేశం స్ధానిక సీనియర్ నాయకుడూ, కొప్పువెలమ కుల ప్రముఖుడూ, రాజమండ్రి మాజీ మేయర్ వీరరాఘవమ్మ భర్తా, తెలుగుదేశంలో దివంగత ప్రముఖుడు ఎర్రన్నాయుడు వియ్యంకుడూ అయిన ఆదిరెడ్డి ఆప్పారావు రాజమండ్రి సిటి సీటుని ఆశించి - బొమ్మన కంటే ముందుగానే వై ఎన్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. బొమ్మనకే టికెట్ అని జగన్ చెప్పాక కూడా ఆదిరెడ్డి పట్టువిడువని ప్రయత్నం ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ తెచ్చిపెట్టింది. ఆపార్టీకున్న సంఖ్యాబలం రీత్యా ఈయన ఎమ్మెల్సీ అవుతారు.
రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో ప్రచారం చేసుకోవాలని పండ్ల వ్యాపారీ, కాపు ప్రముఖుడు, దివంగత నేత జక్కంపూడి రామమోహనరావు ప్రముఖ అనుచరుడు ఆకుల వీర్రాజు కి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. జైలు వద్ద ములాఖాత్ లో జగన్ స్వయంగా వీర్రాజుకి ఈ విషయం చెప్పారని, పిలిచి ఇచ్చిన ఈ ఆవకాశం శుభసూచకమని వీర్రాజు మద్దతుదారులు సంబరపడిపోతున్నారు.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జక్కంపూడి విజయలక్ష్మి పోటీ చేయగలరని అందరూ భావించారు. నరసాపురంకాంగ్రస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడితో ఇటీవలే ఈమె వియ్యమందటంతో రాజకీయంగా మరింత బలపడ్డారు. జక్కంపూడి అనుచర సహచర బలగం ఒక్క నియోజకవర్గానికిమాత్రమే పరిమితమై వుండేది కాదు. ఆయన మరణానంతరం ఆ వెలుగు కాస్త మసకబారింది. సెటిల్మెంట్ల వివాదాల్లో కుటుంబీకుల పేర్లు అపుడపుడూ వినిపిస్తూంటాయి. ఈ నేపధ్యంలో రాజమండ్రి రూరల్ టికెట్ ను పిలిచి మరీ ఆకుల వీర్రాజుకి ఇవ్వడం గమనార్హం.
అయితే కాపుసామాజిక వర్గం నేపధ్యం వల్ల జక్కపూడి కుటుంబాన్ని విస్మరించే పరిస్ధితి వుండదు. రాజమండ్రి పక్కనే వున్న రాజానగరం నియోజక వర్గంలో కాపులు కమ్మలు సమానంగా వుంటారు . కులబలం గట్టిగా వున్న జక్కంపూడి విజయలక్షి్మకి గట్టి పోటీ వుండే రాజానగరం సీటుని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ రిజర్వ్ చేసినట్టు కనిపిస్తోంది.
జైల్లో వుండటం కూడా క విధంగా జగన్ కు 'బయట నుంచివత్తిడి లేకుండా' నిర్ణయాలు తీసుకోడానికి ఉపయోగపడుతోంది. అయితే ఈ నిర్ణయాల వెనుక ఒక పటిష్టమైన నెట్ వర్క్ ఆయనకు కళ్ళూ, చెవులుగా పనిచేస్తున్నాయని 'రాజమండ్రి నిర్ణయాలే' వెల్లడిస్తున్నాయి.
No comments:
Post a Comment