ముగ్గురు పట్టే బెంచీ మీద ఓ పడుచు జంట ఒకరినొకరు ఆనుకుని కూర్చున్నతీరు వాళ్ళ పక్కన ఇంకో నలుగురికి చోటున్నంత విశాలంగా వుంది :) ఇలాంటి సన్నివేశాలు రాజమండ్రిలాంటి చిన్న ఊళ్ళో కూడా పార్కుల్లో కనబడుతున్నాయి... వీళ్ళని చూడటం అసౌకర్యంగా వుండేది...చికాకుగా వుండేది..."ఇదొకదశ దానినుంచి మరోదశలో వారే బయటపడతారు" అని ఒక ప్రస్తావనలో ఓ ఫ్రెండ్ కామెంట్ చేశాక నా ఆలోచన మారిపోయింది
అసలు పరవశం లేని మనిషి మనిషెలా అవుతారని అనుమానమొస్తోంది. ఊపిరాడనివ్వని ఉద్రేకాలతో ఊగిపోవడం, తెరిపిలేని కుండపోతలో తడసిపోవడం, తెలిసి తెలిసి తనను కోల్పోవడం మనుషులకు ఇష్టం. పరవశం అద్బుతమైన అనుభవం. తన్మయత్వంలో తనను తాను కోల్పోవడం మనిషికి అపురూప అనుభవం
మోహంతోవున్న పడుచుజంటల మధ్య ఇలాంటి భావావేశాల రూపం ఇద్దరి మధ్యా గాలికి కూడా చోటులేనంత గాఢంగానే వుంటుంది. ఏకాంతంలో అలాంటి స్ధితి ఇద్దరికీ హద్దులు తెంచేయవచ్చు కాబట్టి పార్కుల వంటి పబ్లిక్ ప్లేసులే బెటరేమో!
స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అసహజం కాదు. అందుకు మూలమైన లిబిడోని కృత్రమంగా రెచ్చగొట్టే ఎంటర్ టెయిన్ మెంటు మీడియా వెనుక వ్యాపార మూలాల్ని ఒదిలేసి పార్కులో (వేలంటెయిన్స్ డే నాడు మాత్రమే)కనిపించే జంటలకు పెళ్ళిళ్ళు చేసేస్తామనే సంస్ధల దృష్టీ, దృక్పధాలను భరించడమే బహిరంగ కౌగలింతలు చూడటంకంటే కష్టంగా అనిపిస్తోంది
No comments:
Post a Comment