Thursday, February 21, 2013

షాక్ లో వున్నాం - శూన్యంగా వున్నాం - దిగులుగా ఉన్నాం

జీవితంలో కష్టాలు సమస్యలు మోసుకుంటూ రేపటిమీద ఆశలతో ఉన్నంతలో సంతోషంగా బతికేస్తున్న అతి మామూలు మనుషులు బతికుండగానే పేలిపోవడాన్ని,గాయపడినవారు భయంతో బాధపడటాన్ని చూస్తున్నాం.

పాలనలోనే కాదు. హింసలోనూ రాజకీయాలున్నాయి. సిద్ధాంత వైరుధ్యాలు వున్నాయి. అవి హింసను ఆయుధంగా చేసుకుని అదాటుగా విరుచుకు పడుతున్న ప్రతీసారీ ఇలాగే జరగడాన్ని చూస్తున్నాం.

భయపడటం..బాధపడటం..ఆవేశపడటం..నిస్సహాయతతో రగిలిపోవడం...రోజువారీ బతుకులో పడిపోవడం...అలవాటుపడిపోయాం.

దేశద్రోహులైన విధ్వంసక శక్తులు విదేశీ శక్తులతో చేతులు కలిపి ఇటువంటి దాడులు చేస్తున్నారని ప్రతీసారీ తెలుసుకుంటున్నాం.

సంయమనం పాటించండి...నేరగాళ్ళను వొదిలేది లేదు...లాంటి మాటలు చెప్పే నాయకుల మీద చిరాకుపడుతున్నాం.

బావురుమని ఏడవనివ్వని దుఃఖం బాధితులను మరింత బాధితులుగా మారుస్తుంది. బాధలో వున్నవారికి లోకం గొడ్డుపోలేదన్న ధీమా అడుగంటి పోతుంది. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్న ఆశ చచ్చిపోతుంది.

నెత్తురోడే మాంసపు ముద్దలుగా రోడ్డుమీద విచ్చిన్నమైపోయిన మనుషుల దుర్మరణాలను వీరమరణాలనీ త్యాగమరణాలనీ ప్రస్తుతించుకుంటాం అయినా మనిషితనపు జ్ఞాపకాలను కుక్కచావు దయనీయంగా వెంటాడక మానదని మౌనంగా తలపోసుకుంటాం

ఉరితీతలు ...కాల్చివేతలు...ఉద్వేగాల్ని ఉపశమనపరచవచ్చు...కష్టాలతోనే ఉన్నంతలో సంతోషంగా బతకడానికి ఇలాంటి విస్ఫోటనాలు అడ్డుపడవని భరోసా కావాలి. ఆ నమ్మకం ఇవ్వాల్సిన ఆబాధ్యత పాలకులదే..అందుకు వారేం చెప్పినా చేయడానికి మనం సిద్ధంగా వున్నాం.








No comments:

Post a Comment