Thursday, February 21, 2013

కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్ష పదవి ఒక వ్యక్తికి రెండుసర్లే అదీ 45 ఏళ్ళలోపలే! రాజకీయాల్లో రిటైర్ మెంటు-రాహుల్ ప్లాన్?

ముప్పై ఐదేళ్ళ లోపు వయసువారు జనాభాలో 50 శాతానికి చేరుకున్న మనదేశంలో రాజకీయ నాయకులకు రిటైర్ మెంటు అవసరమేనా ? ఈ దిశగా రాహుల్ గాంధీ సంస్కరణలు ప్రారంభించారా ? కాంగ్రెస్ నాయకులు అమలు అవ్వనిస్తారా ?

రాజకీయాల్లో వయోపరిమితి కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమౌతోంది. 43 ఏళ్ళరాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడి హోదాలో పార్టీ సారధ్యం తీసుకున్నాక చేపట్టిన సంస్కరణల్లో ఇది ఒకటిగా కనబడుతోంది.

మండల, బ్లాక్ స్ధాయిలో కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు రెండునెలల్లో పూర్తిచేయాలని జైపూర్ లో జరిగిన సదస్సు నిర్ణయించింది. ఈ కమిటీల్లో ఇప్పటికే రెండు సార్లు అధ్యక్ష పదవులు నిర్వహించిన వారు మరో సారి ఎన్నిక కాకుండా చూడాలని అలాగే 45 ఏళ్ళ వయసు పైబడినవారు పోటీ పడరాదని సదస్సు సూచించినట్టు తెలుస్తోంది. ఇదంతా రాహుల్ గాంధీ'విజన్' లో భాగమేనని అర్ధమౌతోంది.

పొలిటికల్ రిటైర్ మెంటు కోసం చట్టంచేయడం ప్రాధమిక హక్కులకు భంగకరం. ప్రజాస్వామ్య విరుద్దం. నిబద్ధతతో రాజకీయ పార్టీలు 'కట్టడి' ద్వారా మార్పులను తీసుకురావచ్చు.

సాంఘిక, ఆర్ధిక, రాజకీయ చైతన్యాల నుంచి వాటంతట అవే చాలా మార్పులు వస్తాయి. చదువు విస్తరించడం, స్త్రీలు చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనడం, విద్యావంతులైన యువతరం, బాగాసంపన్నులు,పారిశ్రామికవేత్తలు నేరుగా చట్టసభలకు ఎన్నిక కావడం మొదలైనవన్నీ ఈ తరహా మార్పులే. రాజకీయంగా ఉన్నత స్ధానాల్లో వున్న వారికి సంకల్పం చిత్తశుద్ది అమలుచేయగల సామర్ధ్యం వుంటే చిన్న మార్పే పెద్దవిప్లవం కావచ్చు.

అధికార పదవులకు, పార్టీలో నిర్వహించిన పదవులే ఒక గీటురాయి అన్న ప్రమాణాలను స్ధూలంగా అన్ని పార్టీలూ పాటిస్తున్న నేపధ్యంలో 45 ఏళ్ళకుమించిన కాంగ్రెస్ అధ్యక్షులు కాకూడదంటే, మూడోసారి పదవి వద్దంటే పెద్దలుపడనిస్తారా అన్నది అనుమానమే!

పెత్తందార్లే గదిలో కూర్చొని సభ్యత్వాలు రాసి డబ్బు కట్టి 'పార్టీ ఎన్నికల తంతు' ముగించే అలవాటు కాంగ్రెస్ వారిది.కొత్త సూచన కూడా వారిపనిని ఇబ్బంది పెట్టకపోవచ్చు. 'పోటీకి మరెవరూ ముందుకి రాకపోవడం వల్ల ఏకగ్రీవ తీర్మానాల' ద్వారా పాత వారే ఎన్నికయ్యే ప్రక్రియ పూర్తికావచ్చు.

అయితే చైతన్యం పెరుగుతున్న కాంగ్రెస్ యువకులు పూనుకుంటే మార్పుతప్పదు. రాహుల్ ఆశ కూడా అదేననిపిస్తోంది

వయోపరిమితి మూడోసారి ఎన్నిక మొదలైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు జిల్లాకాంగ్రెస్ అధ్యక్షులకు ఎమ్మెల్యేలకు ఎంపిలకు ఈ మధ్యే లేఖరాశారు. మండల స్ధాయి పార్టీ కమిటీల ఏర్పాట్లపై నెలాఖరుకల్లా పిసిసికి నివేదిక పంపాలని కోరారు.

ప్రాధమిక స్థాయి కాంగ్రస్ కమిటీలంటే సాధారణంగా ఒక 'మాటమీదే' నియామకమౌతూంటాయి. ఈ వయో పరిమితులు పైస్ధాయి కమిటీలకు వెళితే మనం చూస్తున్న నాయకులందరూ రిటైర్ అయిపోతారు. అది సహజంగానే వారికి ఇష్టముండదు. అందువల్లనో ఏమో " ప్రాధమిక స్ధాయి కాంగ్రెస్ కమిటీ నేతల కు 45 ఏళ్ళ వయోపరిమితి-రెండుసార్లకు మించి పదవి చేపట్టరాదు" అనే సూచన కు కాంగ్రెస్ నాయకులు పెద్ద ప్రచారం ఇవ్వటం లేదు. ఏస్ధాయిలో అయినా వయో పరిమితి విషయమే కాదన్నట్టు పెదవి మెదపడం లేదు.










No comments:

Post a Comment