Sunday, April 28, 2013

అనుభూతి చెందితేతప్ప చిరునవ్వు, దుఃఖం లాంటి ఉద్వేగాలు మొహంమీద కనిపించవు....ఇపుడు చంద్ర బాబు నవ్వగలుగుతున్నారు

అనుభూతి చెందితేతప్ప చిరునవ్వు, దుఃఖం లాంటి ఉద్వేగాలు మొహంమీద కనిపించవు. ఇవి తెలివితేటలకు సంబంధించినవి కావు. ఇవి హృదయానికి సంబంధించినవి. ఇపుడు చంద్ర బాబు నవ్వగలుగుతున్నారు

జర్నలిస్టునై వుండటంవల్ల చంద్రబాబు నాయుడుతో, ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ, ప్రతిపక్షనాయకుడిగా వున్నపుడూ చాలాసార్లు మాట్లాడే అవకాశం దొరికింది. చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగింది.

నవ్వకపోవడం చూసి, (అధికారంలో లేనపుడుకూడా) ప్రజలు అతిసమీపంలోకి వచ్చే అవకాశమే ఇవ్వకపోవడం చూసి ఈయనకి మెదడుతప్ప హృదయంలేదేమో అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఒకసారి అనిపించింది.

విక్టరీ కి చిహ్నంగా v ఆకారంలో రెండు వేళ్ళను చూపిస్తూ ప్రజలకు అభివాదం చేసేవారు. రెండు చేతులూ జోడించేవుంచి వేదికంతా తిరుగుతూ ప్రజల్ని పలకరించే (అందరి రాజకీయవాదుల మాదిరిగా) అలవాటు వున్న తెలుగుదేశం నాయకులే మనదికాని "విక్టరీ"అభివాదం చేయడానికి ఇబ్బంది పడేవారు.

మామూలుగా గంభీరంగా, అధికారులదగ్గర మరీ గంభీరంగా ప్రజల మధ్య చిరునవ్వులు చించించడానికి విఫల ప్రయత్నం చేసిన నాయకుడిగా రెండుదశాబ్దాలు గడిపేసిన చంద్రబాబు వ్యవహార శైలిలో బాడీ లాంగ్వెజిలో చాలా మార్పులే తెచ్చుకున్నారు. "మీకోసం వస్తున్నా" యాత్రలో నేను ఇదిగమనించాను

రెండు వేళ్లతో విక్టరీ సింబల్ చూపించే చంద్రబాబు ఇప్పుడు రెండు చేతులూ జోడించి దండం పెడుతున్నారు. ముఖంలో గాంభీర్యాన్ని వదిలేసి చిరునవ్వు చిందిస్తున్నారు. పాదయాత్రకు బయలుదేరినప్పటి నుంచే ఆయన శైలిని మార్చుకున్నప్పటికీ పాదయాత్ర పూర్తయ్యే సరికి అది సహజసిద్ధంగా వచ్చేసి స్థితికి చేరుకుంది.

హైటెక్ చంద్రబాబు అనే ముద్రను పోగొట్టుకుని ప్రజల మనిషిని అని చెప్పుకోవడానికి అవసరమైన శైలిని అలవరుచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుంది .

గంజి పెట్టి ఇస్త్రీ చేసిన చొక్కాను నలగనిచ్చేవారు కాదు. క్రాఫ్ కొద్దిగా కూడా చెదిరేది కాదు. నిత్యం నల్లగా నిగనిగలాడే బూట్లతో కనిపించేవారు. జన సమూహాలకు ఒక అడుగు దూరంలో ఉండి మాట్లాడేవారు. దగ్గరికి వచ్చినవారి భుజంపై చేయి వేసి మాట్లాడే అలవాటు తక్కువగా ఉండేది.

ఇప్పుడు బాబులో ఎన్నో మార్పులు. చొక్కా నలిగినా, జుట్టు చెదిరినా పట్టించుకోవడం లేదు. పాదయాత్ర మొదలు తన వద్దకు వచ్చిన వారి భుజాలపై చేయి వేసి నడుస్తూ మాట్లాడుతున్నారు. గంభీరంగా ఉండాలని ప్రయత్నం చేయకుండా నవ్వుతూ వారితో కలిసి ప్రయత్నం చేస్తున్నారు.

పాదయాత్ర చేస్తూనే పార్టీ వ్యవహారాలను కూడా చక్కదిద్దే పనిచేశారు.దాంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. అయినా సంయమనం పాటించారు. నాయకులపై బహిరంగంగానే ఫిర్యాదు చేసిన కార్యకర్తల మనోగత భావాలను సంయమనంతో శ్రద్ధగా అర్ధంచేసుకుని ప్రతీనియోజక వర్గ సమావేశంలోనూ స్వయంగా నోట్స్ రాసుకున్నారు. తీవ్రమైన కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు ఉన్నా మొండిగా పాదయాత్ర చేశారు. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

మొక్కని దేవుడు లేడు, పలకరించని మనిషి లేడు అన్నట్లు చంద్రబాబు నాయుడి "వస్తున్నా.. మీకోసం" పాదయాత్ర సాగింది.

పాదయాత్రలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రికార్డును ఆయన బద్దలు కొట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు రెట్టింపు దూరం నడిచి రికార్డు సృష్టించారు.

సరిగ్గా దశాబ్దం కిందట పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి 1356 కి.మీ. నడిచారు. అప్పుడు ఆయన వయసు 53 ఏళ్లు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు. 11 జిల్లాల్లోని 33 అసెంబ్లీ నియోజక వర్గాలను ఆయన సందర్శించారు. ఆయన పాదయాత్ర 55 రోజులపాటు సాగింది.

చంద్రబాబు 63 ఏళ్ల వయసులో పాదయాత్రను చేపట్టారు. తన 64వ పుట్టిన రోజును కూడా ఆయన పాదయాత్రలోనే జరుపుకొన్నారు. చంద్రబాబు పాదయాత్ర సుదీర్ఘంగా 208 రోజులపాటు సాగింది. అంతే సుదీర్ఘంగా ఆయన 2,817 కి.మీ. నడిచారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మొదలు పెట్టి విశాఖ నగరంలోని శివాజీ నగర్లో ముగించారు.

ఈ యాత్ర సందర్భంగా చంద్రబాబు 16 జిల్లాల్లోని 86 అసెంబ్లీ నియోజక వర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లు, 162 మండలాలు, 1,253 గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు.

చంద్రబాబుకు మించిన పాదయాత్ర చేసిన వాళ్లు దేశంలో ఒక్కరే ఉన్నారు.మాజీ ప్రధాని చంద్రశేఖర్ రికార్డు స్థాయిలో పాదయాత్ర చేశారు. ఆయన కన్యాకుమారి నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని మహాత్మ గాంధీ సమాధి రాజ్ఘాట్ వరకు పాదయాత్ర చేశారు. ఆరున్నర నెలలపాటు 4,260 కిలోమీటర్లు నడిచారు. ఆయన చంద్రబాబు మాదిరిగా ఇన్ని గ్రామాలు పర్యటించలేదు.

208 రోజుల కఠోర దీక్షలో ఈ లక్షణాలన్నీ బాబు వ్యక్తిత్వంలో భాగమైపోయాయనే నాకు అనిపిస్తూంది. కలివిడి తనం తక్కువగా వుండి, ప్రజల నుంచిగాక అవకాశాలనుంచి ఉన్నత స్ధానాలకు ఎదిగిన బాబుకి రెండు ఓటములు ఆత్మపరిశీలనను తెచ్చిపెట్టాయి. ఆపరిణామం నుంచి సంభవించిన టా్రన్స్ ఫర్ మేషన్ లేదా పరివర్తన బాబు పాదయాత్రలో పరిశీలకులకు స్పష్టంగా కనిపించింది

బాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు కాకపోవచ్చు. కానీ ఆయనలో పెద్ద పరివర్తనైతే సంభవించింది