Wednesday, March 6, 2013

తెలుగుదేశం బిజెపితో సెట్టవుతుందా?

ఏపార్టీకీ ప్రజలు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వని సంకీర్ణరాజకీయాలు ముఖ్యంగా స్ధానిక, ప్రాంతీయ పార్టీలకు ప్రాణసంకటమే! తెలుగుదేశం పార్టీ ఇపుడు ఇలాంటి సంకటంలోనే పడినట్టుంది

సంకీర్ణరాజకీయాల్లో పార్టీల పాత్ర వేరుగా వుంటుందని బిజెపితో జతకట్టినప్పుడు, ఆబంధం వొదిలించుకుని కమ్యూనిస్టులతో దోస్తీ కుదుర్చు కున్నప్పుడు చంద్రబాబు తరచు చెప్పేవారు. ఎన్ని భాష్యాలు చెప్పుకున్నా, ఫలితాలు మాత్రం ఒకోసారి 'చారత్రక తప్పిదాలు' అయిపోతూంటాయి. ఈసారైనా అలాంటి తప్పిదాలు చేయరాదన్న స్వరాన్ని తెలుగుదేశంలోని బిజెపి సానుభూతి పరులు పెంచుతున్నారు.

దేశంలో బిజెపికి అనుకూలమైన గాలి మొదలైంది. బిజెపి నాయకత్వంలోని ఎన్ డి ఎ ఈ సారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని రకరకాల సర్వేలు సూచిస్తున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ భావి ప్రధానికాగలరన్న సూచనలు ఆపార్టీ కార్యకర్తల్లో ఊపు పెంచడమేకాక సామాన్య ప్రజల ఆలోచనల్ని కూడా బిజెపి వైపు ఆకర్షిస్తున్నాయి

తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు మాజీమంత్రి పెద్దిరెడ్డి "బిజెపి కి దేశమంతా అనుకుకూలంగా వుందని" వ్యాఖ్యానించడం తెలుగుదేశంలో బిజెపి కి అనుకూలమైన మూడ్ కి ఒక సంకేతమనిపిస్తోంది.

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తో ఎమ్ ఐ ఎమ్ పొత్తు ఇకలాంఛనం మాత్రమే. టి ఆర్ ఎస్ ఒంటరిగానే పోటీచేస్తుంది. తాజా మిత్రుల్లో సిపిఐ మాత్రమే తెలుగుదేశం జతగా అంతంత మాత్రంగా వుంది. సిపిఎం తెలుగుదేశంతో స్నేహాన్ని రిన్యువల్ చేసుకోవాలో లేదో ఇంకా తేల్చుకోలేదు.

తెలుగుదేశం బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడు బిజెపి ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి. వామపక్షాలతో పొత్తు పెట్టుకుననప్పుడు మాత్రం ఆపార్టీల సొంత ఓట్లు తెలుగుదేశానికి పూర్తిగా పడలేదు.

దేశంలో తృతీయ ప్రత్యామ్నాయమనే ఆశే ప్రస్తుతానికిలేదు. 2014 ఎన్నికల్లలో విజయం సాధించలేకపోతే తెలుగుదేశం మనుగడే కష్టమౌతుంది. ఈ నేపధ్యంలో బిజెపితో అవగాహనకు సిద్ధపడకతప్పదని చంద్రబాబు మీద పార్టీనుంచే వత్తిడి పెరుగుతుంది. అందుకు పెద్దిరెడ్డి వ్యాఖ్యలే నాంది అనిపిస్తున్నాయి.

తెలుగుదేశం సరేననాలేగాని బిజెపి సై అననడానికి పెద్దగా ఇబ్బంది వుండదు. అంతగా పటిష్టపడని ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎదుగుదలకు తెలుగుదేశం గట్టి అండ అవుతుందన్న బిజెపి నాయకులే రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు






No comments:

Post a Comment