Wednesday, January 30, 2013

రాజకీయ అనిశ్చిత - "పోలవరం" ఆగేనా సాగేనా

పూర్తవుతుందో లేదో తెలియని పోలవరం ప్రాజెక్టు కూడా వేర్పాటు, సమైక్య వివాదంలో చిక్కుకుంది. రాష్ట్రం విడిపోకుండా, నీటిపంపకాలు తేలకుండా ప్రాజెక్టుని కట్టనిచ్చేది లేదని టి ఆర్ ఎస్ గట్టిగా చెబుతోంది. ఇప్పటికే 3 వేలకోట్ల రూపాయల ఖర్చయిన ప్రాజెక్టుని ఎలా ఆపుతారన్నది సీమాంధ్ర నాయకుల ప్రశ్న.

పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా, కృష్ణా నదికి 80 టి ఎంసిల నీరు ఇచ్చేలా, 650 మెగావాట్ల జలవిద్యత్తు ఉత్పత్తి చేసేలా, బహుళ ప్రయోజనాలకోసం 150 అడుగుల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడానికి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం డిజైన్ చేసింది. ఈ డిజైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, ఒరిస్సా రాషా్ట్రల్లో ముంపునకు గురయ్యే 207 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఈ ప్రకారం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 17 వేలకోట్లరూపాయలు అవసరమౌతాయి. ప్రాజెక్టు కట్టకముందే ఎక్కడాలేని విధంగా కాల్వల తవ్వకం మొదలు పెట్టారు. ఇపుడవి పూడిపోతున్నాయి కూడా. వై ఎస్ మరణించాక ఆపనులు నత్తనడకగా వున్నాయి. కొద్దిపాటి పనులు జరుగుతున్నా కోర్టు లిటిగేషన్లు అడ్డు పడుతున్నాయి.

తెలంగాణా వారు వద్దంటున్న, సీమాంధ్రులు కావాలంటున్న స్ధితిలో ఈ ప్రాజెక్టు విషయమై నిర్ణయం తీసుకునే సావకాశం, తెగువ, సంకల్పం, రాష్ట్రప్రభుత్వానికి లేదు. ఒకవేళ వున్నా నిధులు లేవు. కేంద్రాన్ని నిధులడగడానికి "ఇపుడది అవసరమా" అన్న ప్రశ్న ఎదురౌతుందని సంకోచం.

రాజకీయ అనిశ్చిత తోపాటు పునరావాసానికి సంబంధించిన సవాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు ముందున్నాయి.
సోనియా గాంధీ చైర్ పర్సన్ గావున్న జాతీయ సమగ్రతా మండలి జారీచేసిన మార్గదర్శకసూత్రాల ప్రకారం ఒక ప్రతిపాదిత ప్రాజెక్టు కింద మునిగిపోయే జనావాసాల ప్రజల్లో 50 శాతానికి మించి షెడ్యులు తెగలు కులాల వారుంటే ఆ ప్రాజెక్టుకి ఆనుమతి ఇవ్వకూడదు. పోలవరం ప్రాజెక్టుకోసం ఖాళీచేయవలసినవారు పూర్తిగా ఎస్ టి లే. ఈ స్ధితిలో అనుమతి ఎలా వస్తుందన్నది పెద్ద ప్రశ్న.

విద్తుత్ ఉత్పాదన లేకుండా ప్రాజెక్టు ఎత్తుని 150 నుంచి 100 అడుగులకు తగ్గంచి పోలవరాన్ని కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మారిస్తే ఇందుకు ఖాళీ చేయించవలసిన గ్రామాలు 54 ఉంటాయని అవికూడా ఖమ్మం జిల్లాలోవేనని సిపిఎం పార్టీ డిజైన్ మార్పుని సూచించింది.ఇందువల్ల ఇతర రాష్టా్రల అనుమతుల ప్రమేయమే వుండదు.

కాంటా్రక్టర్ల నుంచి ముందుగానే లంచాలు గుంజుకోవడానికే ప్రాజెక్టు కంటే ముందుగా కాల్వల పనులు ఇచ్చేశారన్న సమంజసమైన హేతుబద్ధమైన విమర్శలను ఎదుర్కొంటూ కూడా మొండిగా సాగిపోయిన వై ఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక దుర్మరణం తరువాత పోలవరం ప్రాజెక్టుని పట్టించుకున్న రాజకీయ సంకల్పం, నాయకత్వం లేకపోవడంతో ఈ భారీ ప్రాజెక్్ట అనాధ అయిపోయింది. లాంచన ప్రాయమైన బడె్జట్ కేటాయింపులతో ప్రాజెక్టు బతికే వుంది. ఈ ఖర్చులే తడిసి మోపెడైనట్టు 3 వేల కోట్ల రూపాయలకు చేరాయి.

రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగే వరకూ ఆగని ఖర్చులతో పూర్తికాని పనులతో ఎప్పటికీ ముగియని టివి సీరియల్ కథలా పోలవరం ప్రాజెక్టు సాగుతూ వుంటుంది

No comments:

Post a Comment